నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

by velandi.Saikiran |

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఆదివారం జరుగనుండటంతో వరంగల్‌లోని సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
X

దిశ, వరంగల్ బ్యూరో: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఆదివారం జరుగనుండటంతో వరంగల్‌లోని సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులకు అవసరమైన తాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పరీక్షా కేంద్రంలో మొత్తం 480 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారి కోసం 20 పరీక్షా గదులను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు 40 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అన్ని గదుల్లో జామర్లు ఏర్పాటు చేయడంతో పాటు, 35 సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. అభ్యర్థులకు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి కలదని, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్షా నిర్వహించడం జరుగుతుందన్నారు. దివ్యంగులకు 6.16 వరకు పరీక్షా నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్, పరీక్ష నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Next Story