- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం..ఆరుగురు అరెస్ట్
నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి, సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి, సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. శనివారం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ అపరెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఉత్కం విజయ్, వాసాల గణేష్ కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి రెండు లారీలకు నకిలీ ట్రక్ షీట్లు జారీ చేయగా, వాటిని ఉత్కం విజయ్ సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశాడు. అనంతరం వచ్చిన నిధులను నిందితులు పంచుకున్నారు.
అదే విధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ , బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ షీట్ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. దానిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపాడు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. ఇంకా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపరెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో మాత్రం దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు.
ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించినట్లు విచారణలో తేలింది. నిందుతులైన ఉత్కం విజయ్, కమ్మరి రాజశేఖర్, చెపూరి మధుకర్, వాసాల గణేష్, గాజుల నవీన్‌లను అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, రూ.14,16,800 నగదును స్వాధీనం చేసుకోగా, 46,21,358 మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ పత్రాలు సృష్టించి, ధాన్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.






