గాజు ఛాంబర్లతో కూడిన స్లీపర్ బస్సులపై రవాణా శాఖ కఠిన చర్యలు

by Malleboina Mahesh |

గాజు ఛాంబర్లతో నడిచే ప్రైవేట్ స్లీపర్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ ఉక్కుపాదం.. నిబంధనలు మీరితే వాహనాలు సీజ్!

గాజు ఛాంబర్లతో కూడిన స్లీపర్ బస్సులపై రవాణా శాఖ కఠిన చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏర్పాటు చేసిన ప్రైవేట్ స్లీపర్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేస్తోంది. గత రెండు రోజులుగా నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలకు విరుద్ధంగా గాజు ఛాంబర్లతో నడుస్తున్న మూడు ప్రైవేట్ స్లీపర్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఈ బస్సులన్నీ అరుణాచల్ ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. అనుమతి పొందిన డిజైన్‌కు విరుద్ధంగా చేసిన ఇలాంటి అనధికారిక మార్పుల వల్ల అత్యవసర సమయాల్లో ప్రయాణికులు బయటకు రావడానికి, రక్షణ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి తీవ్ర ఆటంకంగా మారుతున్నాయని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన బస్సుల వివరాలను అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ అథారిటీ తో పాటు, వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్లు జారీ చేసిన అధికారులకు పంపుతూ తెలంగాణ రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. మోటారు వాహనాల చట్ట నిబంధనల ప్రకారం ఆయా బస్సుల ఫిట్‌నెస్, పర్మిట్లను రద్దు చేయాలని కోరింది.

దేశవ్యాప్తంగా జరిగిన పలు స్లీపర్ బస్సుల అగ్నిప్రమాదాల నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సి) ప్రయాణికుల భద్రత కు ఆటంకం కలిగించే నిర్మాణాలు, మార్పులు, మూసివేసిన క్యాబిన్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని... ప్రమాదాలు లేదా అగ్నిప్రమాదాల సమయంలో ప్రయాణికులు వేగంగా బయటకు రావడానికి మరియు రక్షణ సిబ్బంది లోపలికి చేరుకోవడానికి అడ్డంకులు ఉండకూడదని సూచించిందని జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (సీఐఆర్టీ), పుణే నిర్వహించిన అధ్యయనాల్లో స్లీపర్ కోచ్‌లలో గాజు ఛాంబర్లు లేదా పూర్తిగా మూసివేసిన క్యాబిన్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల తరలింపును, రక్షణ చర్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి గాజు ఛాంబర్లతో బస్సులను నడిపితే తక్షణమే సీజ్ చేస్తామని జేటీసీ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఏఐఎస్-119, బస్ బాడీ కోడ్ నిబంధనలు ఇవే

* ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అందుబాటులో ఉండాలి.

* ప్రయాణికుల రాకపోకలకు తగిన గ్యాంగ్‌వే ఉండాలి.

* రూఫ్ ఎస్కేప్ హాచ్‌లు, ఎమర్జెన్సీ విండోలు పనిచేసే స్థితిలో ఉండాలి.

* ప్రమాదం లేదా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు వేగంగా బయటకు వచ్చే విధంగా అంతర్గత నిర్మాణం ఉండాలి.

* అనుమతి పొందిన డిజైన్‌కు విరుద్ధంగా చేసిన మార్పులు (అన్ ఆథరైజ్డ్ మోడిఫికేషన్స్) నిషేధించబడ్డాయి.

Next Story