దిశ ఎఫెక్ట్.. అక్ర‌మ అబార్ష‌న్ గుట్టు ర‌ట్టు..!

by Ratna Kumari |

మ‌హ‌బూబాబాద్ లో అక్ర‌మ అబార్ష‌న్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు అయింది. తీగ లాగితే డొంక మొత్తం క‌దిలింది. దిశ క‌థ‌నంతోనే వెలుగులోకి వ‌చ్చింది.

దిశ ఎఫెక్ట్.. అక్ర‌మ అబార్ష‌న్ గుట్టు ర‌ట్టు..!
X

దిశ, మహాబూబాబాద్/బయ్యారం : పట్టణంలో గుట్టుగా సాగుతున్న అక్రమ అబార్షన్ వ్యవహారం చివరకు బట్ట బయలైంది. నవంబర్ చివరి వారంలో “దిశ”లో వెలువడిన సంచలన కథనం ఈ కేసును కీలక మలుపు తిప్పింది. బయ్యారం మండలానికి చెందిన ఓ మైనర్ బాలికకు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా గర్భస్రావం నిర్వహించారనే ఆరోపణలను దిశ వెలుగులోకి తీసుకురావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించింది. గ‌త ఏడాది డిసెంబర్ 3న బయ్యారం పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి ఒకరిని రిమాండ్‌కు తరలించారు. అనంతరం మరికొన్ని రోజుల వ్యవధిలో మరో మహిళను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. ఇదే సమయంలో వరుస ఎన్నికల కారణంగా విచారణ కొంత నెమ్మదించినా, ఎస్పీ శబరిష్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. కేసును వదలకుండా ముందుకు తీసుకెళ్లడంలో బయ్యారం సీఐ రవీందర్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

“తీగ లాగితే డొంక కదిలినట్టుగా” దర్యాప్తు ముందుకు సాగుతుండగా అసలు వ్యవహారం బయటపడింది. మానుకోట పట్టణంలోని ఆయూష్ ఆస్పటల్ కేంద్రంగా అక్రమ అబార్షన్‌ల వ్యవహారం సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మైనర్ బాలికకు చట్ట విరుద్ధంగా గర్భస్రావం నిర్వహించడమే కాకుండా, వైద్య నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి రహస్యంగా ఈ ప్రక్రియ నిర్వహించినట్టు ఆధారాలు లభించినట్లు సమాచారం. ఆసుపత్రిలో సరైన అనుమతులు, రికార్డులు, గర్భిణి వయస్సు ధృవీకరణ తదితర అంశాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నట్టు విచారణలో బయటపడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన విజయ్, మహేష్, నరేష్, డాక్టర్ అంజన్ కుమార్, అరుణ వెంకటరమణలతో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ రవీందర్ వెల్లడించారు. పోక్సో తో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మైనర్ బాలికల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. ఈ కేసులో పోలీసుల దృఢ‌మైన వైఖరికి జిల్లా ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “దిశ” కథనంతో ప్రారంభమైన ఈ వ్యవహారం చివరకు పెద్ద అక్రమ జాలాన్ని బయటపెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Next Story