ఉమ్మడి వరంగల్‌లో ఎన్నికల వేళ కార్డుల యుద్ధం

by Ajay Maddhiboyina |

వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి పెరుగుతోంది. బాకీ కార్డుల పేరు మీద బీఆర్ఎస్ నేతలు విడుదల చేస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. దోకా కార్డుల పేరు మీద బీఆర్ఎస్​పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు విరుచుకుపడుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌లో ఎన్నికల వేళ కార్డుల యుద్ధం
X

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి పెరుగుతోంది. బాకీ కార్డుల పేరు మీద బీఆర్ఎస్ నేతలు విడుదల చేస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. దోకా కార్డుల పేరు మీద బీఆర్ఎస్​పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు విరుచుకుపడుతున్నారు. పదేళ్లలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఇరు పార్టీల నేతల మధ్య ఆరోపణలు పెరుగుతున్నాయి. స్థానిక ఎన్నికలను ఉమ్మడి జిల్లాలో దీటుగా ఎదుర్కొనేందుకు ఇరుపార్టీల నేతలు ప్రయత్నం చేస్తున్నారు.

ఇరు పార్టీల ఆరోపణలు..

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు బాహాటంగానే ఆరోపణలు చేసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయిలో లబ్ధిపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా పైచేయి సాధించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతుండడంతో దూకుడును పెంచారు. కేడర్లో నమ్మకం పెంచడంతో పాటు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా ప్రభుత్వం, కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బాకీ కార్డుల పేరు మీద మండలాల వారీగా నేతలు విడుదల చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ హామీ నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు. రైతులు, రైతు కూలీలు, మహిళు, విద్యార్థులు, కార్మికులతో పాటు అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీల వివరాల బ్రోచర్ ను ముద్రించడంతో పాటు పార్టీ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

బీఆర్ఎస్​కు దీటుగా కాంగ్రెస్​..

బీఆర్ఎస్ బాకీ కార్డు ఆరోపణలను ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దీటుగా ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేశారని దోకా కార్డులను విడుదల చేస్తున్నారు. తెలంగాణ వస్తే అన్ని వర్గాలకు మేలు చేస్తామని చెప్పి మోసం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. పదేళ్లలో దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగంతో పాటు ఏ హామీని నెరవేర్చలేదని, కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బాకీ కార్డుకు దీటుగా దోకా కార్డును కూడా విడుదల చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి పనులను చేపడుతున్నామని వారు వివరిస్తున్నారు.

గ్రామాల్లో రాజకీయ వేడి..

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరగడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రగులుకుంది. ఈ కార్డుల విడుదల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనబడే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కార్డుల యుద్ధం మొదలు పెట్టగా మిగతా పార్టీలు మాత్రం వెనుకబడి ఉన్నాయి. ఈ ఎన్నికల వేళ ఈ కార్డుల విడుదల ఏ పార్టీకి మేలు జరుగుతుందో ఫలితాల తర్వాతనే తేలే అవకాశం ఉంది.

Next Story