- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోర్‌లైన్ రోడ్ పనుల్లో లోపాలు
ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఫోర్‌లైన్ రోడ్ పనులు ఇప్పటికీ సక్రమంగా పూర్తికాకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, భీమదేవరపల్లి : ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఫోర్‌లైన్ రోడ్ పనులు ఇప్పటికీ సక్రమంగా పూర్తికాకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాల లోపాలు, వెడల్పు తగ్గింపు, ట్రాఫిక్ అవ్యవస్థ రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి సాయినగర్ వద్ద రోడ్డు వెడల్పు సుమారు 100 అడుగులుగా ఉండగా, ముల్కనూరు ప్రాంతానికి వచ్చేసరికి అది కేవలం 90 అడుగుల లోపే పరిమితమైంది. రహదారి రెండు వైపులా ఉన్న దుకాణ సముదాయాలు, ఇళ్లు, వాణిజ్య భవనాల కారణంగా రోడ్డు సన్నగిల్లిపోయి వాహన రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ వెడల్పు తగ్గిన ప్రాంతాల్లో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చిన్నా–పెద్ద ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు..
సీసీ రోడ్డు నిర్మాణం, లైటింగ్ సిస్టమ్ పనులు ఆలస్యంగా సాగడం మరో ప్రధాన సమస్యగా మారింది. కొత్తపల్లి సాయినగర్ వరకు లైటింగ్ ఏర్పాట్లు పూర్తయినప్పటికీ, ముల్కనూరు బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద పనులు ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయి. రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు సమాచారం. ఇక అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ స్తూపం రహదారి మధ్య భాగంలో ఉండటం వల్ల రవాణా సౌకర్యం దెబ్బతిని ప్రమాదాల ముప్పు మరింత పెరిగింది. వీటికి తగిన ప్రదేశాలు కేటాయించి రహదారిపై అడ్డంకులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు పక్కన వైన్ షాప్‌లు, టీ స్టాళ్లు, హోటళ్ల వద్ద ద్విచక్ర వాహనాలు అడ్డగోలుగా నిలిపేయడం, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు లేకపోవడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు, తరచూ చిన్న ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారి పనుల మధ్య ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. అదేవిధంగా రోడ్ పనుల్లో డ్రైనేజ్ సదుపాయాల లేమి, మట్టి తొలగింపులో లోపాలు కూడా సమస్యగా మారాయి. వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడం, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు సరిగా ఉండకపోవడం వల్ల ద్విచక్ర వాహనాలు జారిపడే ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రజల అభిప్రాయం..
“రోడ్డు సౌకర్యం కోసం ప్రారంభించిన పనులే ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వెడల్పు తగ్గింది, లైటింగ్ లేదు, ట్రాఫిక్ నియంత్రణ లేదు. రాత్రివేళ ప్రయాణం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా మారింది.” ఫోర్‌లైన్ రహదారి పనులపై సంబంధిత శాఖలు తక్షణమే సమీక్ష చేసి, లైటింగ్ సిస్టమ్, సీసీ పనులు, పాదచారి మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






