సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం : సీఐ సంతోష్..

by Bhanu |   (  Updated:2025-07-18 05:45:22  IST  )

నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సీఐ

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం : సీఐ సంతోష్..
X

దిశ, హనుమకొండ : నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సీఐ సంతోష్ సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల వాడకాన్ని అరికట్టే చర్యలపై గ్రామస్థులకు విలువైన సూచనలు అందించారు.

ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఎవరికీ చెప్పొద్దు..

చరవాణి, ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న క్రమంలో పలు విధాలుగా నేరాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. బ్యాంక్ అకౌంట్స్, ఓటీపీలు, వ్యక్తిగత డేటా గుర్తు తెలియని నంబర్లకు పంపటం, లింక్‌లు క్లిక్ చేయటం వలన చాలామంది మోసపోతున్నారని హెచ్చరించారు. ఈ తరహా మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలి..

సైబర్ నేరాలు జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఏ తప్పు జరిగినా తొందరగా స్పందిస్తే తప్పులను అరికట్టటం సులభమవుతుందని పేర్కొన్నారు.

మాదకద్రవ్యాలపై గట్టి చర్యలు..

గ్రామాల్లో అక్రమంగా మద్యం, గంజాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలన్నదే పోలీసుల లక్ష్యమని తెలిపారు. సమాజాన్ని మత్తు పదార్థాల నుంచి రక్షించేందుకు పోలీసులు, కాకుండా ప్రజల సహకారం కూడా అవసరమని, గ్రామస్థులు తమ కుటుంబాలను, సమాజాన్ని రక్షించడంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులు ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసించారు.

Next Story