కళ్యాణలక్ష్మిలో లంచాల కలుషితం..! పది శాతం ఇవ్వకుంటే ఫైలు ముందుకు కదలదు..

by Bhanu |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం, కొన్ని ప్రాంతాల్లో అధికారుల అవినీతి చేతుల్లో బందీ అయిపోయింది.

కళ్యాణలక్ష్మిలో లంచాల కలుషితం..! పది శాతం ఇవ్వకుంటే ఫైలు ముందుకు కదలదు..
X

దిశ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం, కొన్ని ప్రాంతాల్లో అధికారుల అవినీతి చేతుల్లో బందీ అయిపోయింది. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని ఓ మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్‌ ఐ) లబ్ధిదారుల పై పదిశాతం లంచం డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ సంకల్పానికి విరుద్ధంగా..

ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లో యువతుల పెళ్లికి రూ. 1,00,116 వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కొంత ఊరట లభించాలి. అయితే ఆ మండలంలో ఆర్థిక ప్రయోజనాల కోసమే కాకుండా, లంచాల వేట కోసం అధికారులే అడ్డుగోలు తీరుతో వ్యవహరిస్తుండటమే ప్రజలను అసహనానికి గురిచేస్తోంది.

బహిరంగంగా లంచం డిమాండ్.. కమీషన్ లేకపోతే ఫైల్ కదలదు..!

ప్రజల ఆరోపణల ప్రకారం, కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు అవసరమైన పత్రాలు అందించినప్పటికీ, ఆర్‌ఐ వారి ఫైళ్లను నిలిపివేస్తున్నాడు. మంజూరయ్యే మొత్తంలో పదిశాతం కమీషన్ ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేస్తూ, డబ్బులు రాకపోతే ఫైల్ ముందుకెళ్లదని, బెదిరిస్తున్నట్టు వాపోతున్నారు. పథకం డబ్బు రావాలంటే ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్‌ ఐ) అధికారికి పది వేల రూపాయల వరకూ ఇవ్వాలని, ఇవ్వలేని పరిస్థితి లో ఉన్నాం అని లబ్ధిదారులు అంటే ఇగ ఆ ఫైలు ముందుకు వెళ్ళకుండా నిర్లక్ష్యం వహిస్తూ లబ్ధిదారులను ముప్పు తిప్పలు పెట్టడమే ఆ అధికారి లక్ష్యం. ఇదేనా సంక్షేమం అంటూ మండలంలోని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు లబ్ధిదారులు ఈ వ్యవహారం గురించి పలువురు లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. పలు ఫిర్యాదుల్లో ఆర్‌ఐ మొబైల్ నెంబర్, అసలు డిమాండ్ చేసిన తీరు, మాటల రికార్డింగ్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది విచారణకు దారితీసే కీలక ఆధారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

చట్టం ఏమంటోంది..?

ప్రస్తుతం పనిచేస్తున్న భారత అవినీతి నిరోధక చట్టం, 1988 ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగి ప్రజల నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లబ్ధి కోరితే అది శిక్షార్హం. సంబంధిత అధికారిపై అపరాధ అభియోగాలు, సర్వీసు విచారణ జరిగే అవకాశముంది అని కొందరు నిపుణులు అంటున్నా మాట, అయితే ఈ రెవెన్యూ అధికారి మీద ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్‌ ఐ) పై చర్యలు తీసుకోండి..

రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్‌ ఐ) పై చర్యలు తీసుకోవాలని మండలంలోని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో రూపొందించబడ్డాయి. అలాంటి పథకాలు కొందరి అధికారుల అరాచకాల వల్ల ప్రజలకు శాపంగా మారకూడదు అని, మండలంలోని లబ్ధిదారులు అంటున్న మాట. ఈ ఘటనపై అధికారులు వేగంగా స్పందించి రెవెన్యూ అధికారి ( ఆర్ ఐ ) పై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story