సద్దుల బతుకమ్మ తేదీ పై వివాదం.. 29న, 30నా!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-09-28 06:59:39  IST  )

సద్దుల బతుకమ్మ తేదీ నర్సంపేటలో వివాదాస్పదంగా మారింది.

సద్దుల బతుకమ్మ తేదీ పై వివాదం.. 29న, 30నా!?
X

దిశ, నర్సంపేట: సద్దుల బతుకమ్మ తేదీ నర్సంపేటలో వివాదాస్పదంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30వ తేదీన జరపాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, నర్సంపేట పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ మాత్రం ఈ నెల 29న జరపాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణ వ్యాప్తంగా గల పలు కాలనీల్లో ఆటోలో ప్రచారం సైతం చేస్తుండటంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ మాజీ కౌన్సిలర్ మున్సిపాలిటీ కమిషనర్ కి సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పట్టణ ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదింపి అన్ని వార్డుల్లో సరైన ప్రకటన చేయాలని కోరారు.

కొట్టొచ్చిన సౌకర్యాల లేమి..!

బతుకమ్మ ఏర్పాట్లు నాసిరకంగా ఉన్నట్లు నర్సంపేట మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం ఆరోపించారు. గతంలో బతుకమ్మ దసరా ఉత్సవాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వార్డుల్లోని మట్టి రోడ్లపై మోరం కానీ డస్ట్ కానీ పోసేవాళ్లమన్నారు. ఈ ఏడాది అలాంటి ఏర్పాటు లేవన్నారు. బురదలో బతుకమ్మను తీసుకువెళ్ళడానికి మహిళలు ఇబ్బందులు పడతారని ఆరోపించారు. అక్కడక్కడ తాత్కాలికంగా మొరం పోసి చేతులు దులుపుకున్నారన్నారు. లక్షల్లో బిల్లులు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Next Story