ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేసిన గుత్తేదారుడు

by Taduka Kalyani |

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమళ్ళ సంకీసా ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేశారు.

ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేసిన గుత్తేదారుడు
X

దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమళ్ళ సంకీసా ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు,ఉపాధ్యాయులు పాఠశాలలోకి వెళ్లలేక మండుటెండలో రోడ్డుపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు."పాఠశాల భవనం నిర్మించేటప్పుడు మమ్మల్ని అడిగి కట్టారా? బిల్లుల విషయాన్ని సంబంధిత అధికారులను అడగాలి గానీ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదు"అంటూ వారు కాంట్రాక్టర్ తీరును ఖండించారు. స్థానికుల సమాచారం మేరకు ఇదే కాంట్రాక్టర్ గతంలో కూడా బిల్లుల చెల్లింపుల విషయంలో పాఠశాల గేటుకు తాళం వేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) సంఘటనా స్థలానికి చేరుకుని కాంట్రాక్టర్‌తో చర్చలు జరిపారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగి పాఠశాల గేటు తెరవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు లోపలికి వెళ్లగలిగారు.

Next Story