జనగామ జిల్లాలో 27 నుంచి 29 వరకు కాంటింజెన్సీ విత్తన మేళా

by Taduka Kalyani |

జనగామ జిల్లాలో జూలై 27 నుంచి 29 వరకు కాంటింజెన్సీ విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

జనగామ జిల్లాలో 27 నుంచి 29 వరకు కాంటింజెన్సీ విత్తన మేళా
X

దిశ, జనగామ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి పంటపై మాత్రమే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు జనగామ జిల్లాలో జూలై 27 నుంచి 29 వరకు కాంటింజెన్సీ విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని బచ్చన్నపేట, మల్కాపూర్ (చిల్పూర్), దేవరుప్పుల, ఘన్‌పూర్ (స్టేషన్), ఓబుల్‌కేశవాపూర్ (జనగామ), ఏడునూతుల (కొడకండ్ల), బండ్లగూడెం (లింగాలఘన్‌పూర్), నర్మెట్ట, పాలకుర్తి, రఘునాథపల్లి, జఫర్‌గడ్, తరిగొప్పుల రైతు వేదికల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేళాలో వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేయదగిన కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, కొర్రలు, రాగులు తదితర పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను వివిధ విత్తన సంస్థలు, సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక స్టాళ్లలో రైతులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అదనంగా పంటల ఎంపిక, విత్తనాల మోతాదు, సాగు యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సాంకేతిక సూచనలు, సలహాలు అందించనున్నారని చెప్పారు. రైతులు కోరుకున్న విత్తనాలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో లేకపోతే ఇతర కేంద్రాల నుంచి సమకూర్చి అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ ఈ కాంటింజెన్సీ విత్తన మేళాను సద్వినియోగం చేసుకుని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు.

Next Story