- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనాలు పార్కింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త..!
పార్కింగ్ చేసిన వాహనాలనే లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో వరుస వాహన చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసులు రట్టు చేశారు.

దిశ, ఆదిలాబాద్ : పార్కింగ్ చేసిన వాహనాలనే లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో వరుస వాహన చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో 16 మంది నిందితులపై కేసు నమోదు చేయగా, 10 మందిని అరెస్ట్ చేసి, మరో ఆరుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి 7 మోటార్‌సైకిళ్లు, 3 ఆటోలు, ఒక కారు, ఒక కత్తి, 8 సెల్‌ఫోన్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత నెల రిమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఆటో చోరీ యత్నం జరిగిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జూలై 24న కుప్టి ఘాట్ వద్ద వాహన తనిఖీల సమయంలో పోలీసులను బెదిరించి పరారైన నిందితులను గుర్తించిన పోలీసులు, మరుసటి రోజు వాంకిడి చెక్‌పోస్ట్ వద్ద కారును అడ్డుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో యాసర్ అహ్మద్, మహ్మద్ అద్నాన్ అహ్మద్ అలియాస్ సోహైల్ వాహన డ్రైవర్లుగా పనిచేస్తూ పార్కింగ్‌లో ఉన్న వాహనాలను గుర్తించి ముఠా సభ్యులకు సమాచారం ఇచ్చేవారని తేలింది. అనంతరం ముఠా సభ్యులు వాహనాలను దొంగిలించి, రిసీవర్లైన షేక్ ఇఫ్తేఖార్, షేక్ అబూతలాహాకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ కేసులో జిల్లా పోలీసులు యాసర్ అహ్మద్, అక్బర్ ఖాన్, ఉమర్ ఖాన్, అబ్దుల్ ఫారూక్, అర్బాస్ ఖాన్, మహ్మద్ అద్నాన్ అహ్మద్ అలియాస్ సోహైల్, నాసిర్ బిన్ జావీద్, ఆజామ్ ఖాన్, షేక్ ఇఫ్తేఖార్, షేక్ అబూతలాహాలను అరెస్ట్ చేయగా, మరో ఆరుగురు ఇమ్రాన్, జైన్, జునైద్, సోఫియాన్, ఫర్దీన్, అద్నాన్ అలియాస్ అయాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు వాహనాలను సురక్షిత ప్రాంతాల్లోనే పార్క్ చేయాలని, వీలైనంత వరకు సీసీటీవీ నిఘా ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలని ఎస్పీ సూచించారు. నంబర్ ప్లేట్ లేకుండా లేదా ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్‌లతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, వాహన చోరీలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేష్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, నేరడిగొండ ఎస్‌ఐ సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.






