ఆరోగ్యకరమైన జీవితానికి 5 మార్గాలు.. ఎలాంటి ప్రభావం చూపుతాయంటే..

by Javid Pasha |

ప్రతీ చిన్న విషయానికి అతిగా స్పందిస్తుంటారు కొందరు. కానీ ఇది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

ఆరోగ్యకరమైన జీవితానికి 5 మార్గాలు.. ఎలాంటి ప్రభావం చూపుతాయంటే..
X

దిశ, ఫీచర్స్ : ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రోజువారీ జీవితంలో సమస్యలు, సంతోషాలు సాధారణమే. అయితే ఉరుకులూ.. పరుగుల జీవితంలో ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలోనూ అవస్థలు పడుతుంటారు. ఇలాంటి అనుభవాలు సాధారణమే అయినప్పటికీ కొందరు ఓవర్ థింకింగ్ వల్ల అతిగా ఆందోళన చెందుతుంటారు. దీంతో నిరాశ, నిరుత్సాహం, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలా జరగకూడదంటే.. రోజువారీ జీవితంలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు పాటించాల్సిన టిప్స్ కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఫిజికల్ యాక్టివిటీస్

రోజువారీ జీవితంలో ఫిజికల్ యాక్టివిటీస్‌ని ఎప్పుడైతే దూరమవుతారో అప్పుడు ఒత్తిడి, ఆందోళన రెట్టింపవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామాలు లేదా మీకు నచ్చిన ఏదో ఫిజికల్ యాక్టివిటీని కలిగి ఉండటం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, మెడిటేషన్, జిమ్‌లో వర్కవుట్స్ ఇలా ఏదో ఒక యాక్టివిటీని డైలీ అరగంట ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.

2. భావోద్వేగాల నియంత్రణ

ప్రతీ చిన్న విషయానికి అతిగా స్పందిస్తుంటారు కొందరు. తరచుగా అతి భావోద్వేగాలకు లోనవుతుంటారు. కానీ ఇది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కోపం, ఆవేశం, అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు వంటి విషయాల్లో అతి భావోద్వేగాలు అనర్థానికి దారితీస్తాయి. రక్తపోటు పెరిగేందుకు తద్వారా ఇతర అనారోగ్యాలకు సంభవించేందుకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భావోద్వేగా మీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. యోగా మెడిటేషన్, ప్రకృతితో కనెక్ట్ అవడం వంటివి అందుకు సహాయపడతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

3. నిశ్శబ్దంగా కాసేపు..

సామాజిక జీవితం అవసరం. చాలా ముఖ్యం. కానీ అదే సర్వస్వం కాదు. కాసేపు నిశ్శబ్దంగా.. ఏకాంతంగా లేదా ఒంటిరిగా గడపాలని ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. సమయం లేకనో, సందర్భం రాకనో దీర్ఘకాలంపాటు అలాంటి పరిస్థితికి దూరమైతే మాత్రం ఆందోళన, డిప్రెషన్ వంటివి పెరగొచ్చు. అందుకే అప్పుడప్పుడూ ఎవరూలేకుండా ఒంటరిగా గడపండి. అప్పుడు మీ బాడీ, మైండ్ రిలాక్స్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. నిశ్శబ్ద వాతావరణంలో కూర్చొని మీకు మీరే మనసులో ప్రశ్నించుకోవడం, లోతుగా ఆలోచించడం చేయండి. అప్పుడు మీ సమస్యలకు కారణాలేమిటో గుర్తిస్తారని, పరిష్కారం ఆలోచిస్తారని కూడా అంటున్నారు. పైగా ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసే అసలైన మెడిసిన్ లాంటిది కూడా ఇది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే.. ఉదయం లేదా సాయంకాలం కాసేపు మీకంటూ సమయం కేటాయించుకోండి.

4. నాణ్యమైన నిద్ర..

మైగ్రేన్, తలనొప్పి, ఊబకాయం, మధుమేహం వంటి పలు రకాల అనారోగ్యాలు నిద్రలేమితో ముడిపడి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే.. సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు ఆ ప్రభావం మీ రోజువారీ పనులపై పడుతుంది. ప్రొడక్టివిటీలో క్వాలిటీ తగ్గవచ్చు. దీర్ఘకాలంపాటు నిద్రలేమిని ఎదుర్కొనేవారు మానసిక, శారీరక అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఎక్కువ. అందుకే సంతోషంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఏదో ఒక సమయంలో నాణ్యమైన నిద్రను కవర్ చేయాలంటారు నిపుణులు.

5. సానుకూల ఆలోచన

జీవితంలో ఎక్కువగా నెగెటివ్ కోణాలనే వెతుకుతూ ఉంటే అన్నీ లోపాలే కనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. పైగా దీనివల్ల మీలో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇది అనారోగ్యాలకు, అనర్థాలకు దారితీస్తుంది. అందుకే సహజంగా ఎదురయ్యే ప్రతీ సమస్యకు అతిగా రియాక్ట్ అవడం, అతిగా ఆలోచించడం, ముఖ్యంగా నెగెటివ్‌గా ఆలోచిస్తూ భయపడటం చేయకండి. ఇది మిమ్మల్ని నిజంగానే సమస్యల్లోకి నెట్టే చాన్స్ ఉంటుంది. అయినా ప్రతీ విషయంలో కేవలం నెగెటివిటీ పనికిరాదు. సానుకూల దృక్పథంతో ఆలోచించి చూడండి. అప్పుడు సమస్యగా అనిపించే అనేక విషయాలు సానుకూలంగానే కనిపిస్తాయని సైకాలజిస్టులు అంటున్నారు. పైగా ఇది మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.

Next Story