ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు కల సాకారం..!

by Batti.Sumithra |

దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న విమానాశ్రయ కల సాకారమయ్యే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు కల సాకారం..!
X

దిశ, ఆదిలాబాద్ : దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న విమానాశ్రయ కల సాకారమయ్యే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రాజెక్టు అమలు ప్రక్రియ వేగవంతం కానుండగా, భూసేకరణ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్‌తో పాటు కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు లభించనుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చే దశకు చేరుకోవడంతో జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

2,009 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు..

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని ప్రాజెక్టు కోసం సేకరించనున్నారు. ఇందులో 1,609.23 ఎకరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు, 400 ఎకరాలను సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్, ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ఎంఆర్‌ఓ కేంద్రం, హ్యాంగర్లు తదితర మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, తాగునీటి పైప్‌లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించారు. ఈ పనులను 2026 డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రజాప్రతినిధుల కృషికి ఫలితం..

ఆదిలాబాద్‌కు విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్ ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో భూసేకరణ, తదుపరి నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాకు వరం..

ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించే ప్రజలకు సమయం, వ్యయం రెండూ తగ్గనున్నాయి. అత్యవసర వైద్య సేవలు, పెట్టుబడులు, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

అభివృద్ధికి కొత్త అధ్యాయం..

విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను దేశ, విదేశీ మార్కెట్లకు వేగంగా రవాణా చేసే కార్గో సదుపాయం అందుబాటులోకి రానుంది. స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. కుంటాల, పొచ్చెర జలపాతాలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్, జైనథ్ ఆలయం, సప్తగుండాల వంటి పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల రాక పెరిగే అవకాశముంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాను ఉత్తర తెలంగాణలో కీలక పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా ఈ ఎయిర్‌పోర్టు నిలవనుందని అధికారులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story