ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాల‌ను పూర్తి చేయాలి : మంత్రి సీతక్క

by Ratna Kumari |

ములుగు జిల్లాలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, అలాగే అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని సూచించారు మంత్రి సీత‌క్క‌.

ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాల‌ను పూర్తి చేయాలి : మంత్రి  సీతక్క
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల‌ను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా సిద్ధం చేయాలని, వివిధ శాఖల లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వ‌ర‌గా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క ) అన్నారు. గురువారం ఎస్.ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ వన దేవతలను మంత్రి సీతక్క తో పాటు కలెక్టర్ దివాకర టి. ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి వివిధ శాఖల అధికారులతో మేడారం లోని హరిత హోటల్ లో మేడారం మాస్టర్ ప్లాన్, జంపన్న వాగు అభివృద్ధి పనులు, ఇందిరమ్మ నిర్మాణం, గోదావరి పుష్కరాల నిర్వహణ, వేసవికాలంలో త్రాగునీటి సరఫరా, సెంట్రల్ లైటింగ్, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల‌ను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని, పూర్తయిన ఇండ్లకు డబ్బులు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని, భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించే విధంగా గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, ఆదివాసి పూజారులతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు, సలహాల మేరకు పటిష్టమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అన్నారు. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా జంపన్న వాగుపై చెక్ డ్యామ్ ల నిర్మాణం కోసం నిపుణులతో సర్వే నిర్వహించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడు నెలలు వేసవి కాలంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రజల అభివృద్ధి కోసం వెచ్చించాలని, ములుగు జిల్లా కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా అభివృద్ధి పరచాలని అన్నారు. వచ్చే ఏడాది 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కర ఘాట్ ల వద్ద ప్రజల సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.


వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, షామియానాలు వంటివి పక్కాగా అందుబాటులో ఏర్పాట్లు చేయాలని, భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం జిల్లాలో నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు పకడ్బందీ ప్రణాళికలతో ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించే విధంగా చూడాలని, ఎన్ఆర్ఈజీఎస్ లో కూలీల సంఖ్య పెరిగే విధంగా చూస్తూ ఈ పథకం ద్వారా గ్రామానికి అవసరం అయ్యే పనులను ఎంపిక చేయాలన్నారు. సమావేశానికి ముందు మంత్రి మేడారంలోని హరిత హోటల్ లో ఎస్ ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి / షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఏటూరు నాగారంలోని ఐటీడీఏలో ప్రాజెక్టు అధికారిగా పని చేస్తూ కరీంనగర్ జిల్లాకు కలెక్టర్ గా బదిలీ అయిన చిత్ర మిషను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీ.హెచ్ మహేందర్ జీ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ సునీత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story