విభిన్న తీర్పునిచ్చిన ఓటర్లు.. మూడు విడతల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ

by Ajay Maddhiboyina |

ఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అభ్యర్థులు ఓటర్లకు పట్టం కట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా వారికి నచ్చిన అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించారు.

విభిన్న తీర్పునిచ్చిన ఓటర్లు.. మూడు విడతల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అభ్యర్థులు ఓటర్లకు పట్టం కట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా వారికి నచ్చిన అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వలే వార్ వన్ సైడ్ అని కాంగ్రెస్ పార్టీ నేతలు భావించినా ఓటర్లు మాత్రం విలక్షణ తీర్పును ఇచ్చారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మెజార్టీ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించిన ఓటర్లు, మిగతా పంచాయతీల్లో వారికి ధీటుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. కొన్ని మండలాల పరిధిలో బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను కూడా సర్పంచులుగా ఓటర్లు అవకాశం కల్పించారు. స్వతంత్ర అభ్యర్థులను కూడా గద్దెనెక్కించారు. ఈ దఫా ఎన్నికల్లో ఏకగ్రీవాలకు కూడా ఓటర్లు మొగ్గు చూపారు. తాము అందరి వైపు ఉన్నామనే సంకేతం ఓటర్లు ఇచ్చారు.

పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్..

ఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినా ప్రధానమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులను ఎక్కువ గ్రామాల్లో గెలిచారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1683 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగగా 850 గ్రామ పంచాయతీలకు పైగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. అంతే ధీటుగానే బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 550కి పైగా గెలుచుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఈ రెండు పార్టీల రెబెల్స్ 50 మంది వరకు గెలిచారు. బీజేపీ అభ్యర్థులు నామమాత్రం గెలుచుకోగా, ఆ పార్టీ కంటే స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ గెలుపొందారు.

విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎన్నడు లేనంత డబ్బు, మద్యం అభ్యర్థులు ఖర్చు పెట్టారు. అభ్యర్థులు కనీసం రూ.20లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారు. మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో అంతకుమించి ఖర్చు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగానే ఖర్చు పెట్టారు. మరోవైపు ఏకగ్రీవాలకు ఈ దఫా ఎక్కువగానే ప్రాధాన్యం ఇచ్చారు. ఊరు కోసం రూ.20 లక్షల వరకు ఖర్చు పెడతామని చెప్పిన వారినే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాల వారీగా ఖర్చు పరిశీలిస్తే ఎమ్మెల్యే ఎన్నికల కంటే ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు ఖర్చు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.40కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయగా గ్రామ పంచాయతీల వారిగా చూస్తే ఒక అసెంబ్లీ పరిధిలోనే రూ.100 కోట్ల వరకు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్​హవా..

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో కాంగ్రెస్ హవానే కొనసాగింది. మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో 10 కాంగ్రెసే గెలుపొందింది. 2 పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ ఎంపీలే గెలిచారు. రెండేళ్లు తర్వాత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన గ్రామ పంచాయతీల్లో 60 శాతం వరకు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే గెలుచుకున్నారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు కూడా 35 శాతం పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు. ఈ ఫలితాలు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి వస్తుందనే అంచనా వేసుకుంటున్నారు.

Next Story