పొట్టుపొట్టు కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. ఎమ్మెల్యే ముందే..!

by Bhanu |   (  Updated:2025-06-22 16:18:02  IST  )

కొడకండ్ల మండల కేంద్రంలో శనివారం జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది.

పొట్టుపొట్టు కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. ఎమ్మెల్యే ముందే..!
X

దిశ, కొడకండ్ల : కొడకండ్ల మండల కేంద్రంలో శనివారం జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం సందర్భంగా, కడగుట్ట తండా గ్రామపంచాయతీకి చెందిన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మాటల యుద్ధానికి దిగారు. ఒక్కసారిగా వివాదం పెరిగి ఒకరినొకరు దూషించుకుంటూ గాలిలోకి కుస్తీలు పట్టారు.


ఈ ఘర్షణలో ఓ కార్యకర్త చెవి భాగానికి బలమైన దెబ్బతగిలి, తలకు తీవ్ర గాయమై వెంటనే జనగామ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఘటన ఎమ్మెల్యే సమక్షంలోనే జరగడం గమనార్హం. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో తగిన విచారణ లేకుండా అనర్హులకూ ఇళ్లు కేటాయించబడటం వల్లే ఈ రగడలు చెలరేగాయని తెలిపారు. తూతుమంత్రంగా ఎంపిడిఓ ఇందిరమ్మ ఇళ్ల ఎంక్వైరీ చేసిన మూలంగా.. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారు, పిల్లర్స్ వేసుకున్నవారు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారికి ఇళ్లు కేటాయించడంతో నిజంగా అర్హుల ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆచరణాత్మకంగా స్పందించి, సక్రమ విచారణ చేసి అర్హులకే ఇళ్లు కేటాయించేలా చూడాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Next Story