- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయండి : కలెక్టర్ సత్యశారద
నైరుతి రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని గడువులోగా పూర్తిగా సేకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.

దిశ, ఖానాపురం : నైరుతి రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని గడువులోగా పూర్తిగా సేకరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం ఖానాపురం మండలంలోని మనుబోతుల తండా, పెద్దమ్మగడ్డ తండా, మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న కలెక్టర్ నేరుగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, హమాలీల కొరత వల్ల ఆలస్యం జరుగుతోందని రైతులు వివరించగా.. వెంటనే స్పందించిన కలెక్టర్, కొనుగోలు పూర్తయిన ఇతర కేంద్రాల నుంచి హమాలీలను తరలించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం బస్తాల నిల్వ, తూకాలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీసిన కలెక్టర్, వర్షాలు ప్రారంభమయ్యేలోపు కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
పంట అవశేషాలు కాల్చొద్దు
రైతులకు పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూసారం తగ్గిపోతుందని, దీని ప్రభావం భవిష్యత్ పంటల దిగుబడులపై పడుతుందని పేర్కొన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు
ఖానాపురం మండలంలోని శ్రీనివాసరావు రైస్‌మిల్, సాయి కృష్ణ రైస్‌మిల్, గోపీకృష్ణ ఆగ్రో ఏజెన్సీలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధాన్యం బస్తాల నాణ్యత, తూకాలు, రికార్డులు, రసీదులను పరిశీలించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని మిల్లర్లను హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






