రైతులు భూముల సర్వే, పట్టాల జారీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

by Kodari Anjali |

ప్రభుత్వం రైతుల కోసం నిర్వహిస్తున్న రైతుల భూముల సర్వేను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

రైతులు భూముల సర్వే, పట్టాల జారీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: ప్రభుత్వం రైతుల కోసం నిర్వహిస్తున్న రైతుల భూముల సర్వేను సద్వినియోగం చేసుకొని పట్టాదారు పాసు బుక్కులు పొందాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం బుద్ధారం గ్రామంలో భూపాలపల్లి రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో తెలంగాణ భూ సర్వే సరిహద్దుల నిర్ధారణ పై నిర్వహించిన గ్రామ సభలలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాల మేరకు భూముల సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తూ, అర్హులైన ప్రతి రైతుకు పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నియోజకవర్గంలో సుమారు 50 వేల మంది పట్టాదారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించిందన్నారు. భూపాలపల్లి నియోజక వర్గంలో తదితర గ్రామాల్లో వేల ఎకరాల భూములకు సంబంధించి పట్టాల సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి సర్వే ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

చట్టబద్ధ హక్కులు కలిగిన వారికి...

భూమి యజమాని ప్రత్యక్షంగా హాజరుకాకపోయినా, సంబంధిత వివరాలు నమోదు చేసి సర్వే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి జిల్లా కలెక్టర్‌తో పలుమార్లు చర్చించి ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. పట్టాలు లేక రైతు భరోసా,రైతు బీమా, భూముల రిజిస్ట్రేషన్ వంటి ప్రయోజనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సింగరేణి, సోలార్ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతుల సమస్యలను కూడా సర్వే ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియ ద్వారా ప్రభుత్వ భూములు, లావాణి భూములు, సీలింగ్ భూములు తదితర భూముల వివరాలు స్పష్టంగా నమోదవుతాయని, చట్టబద్ధ హక్కులు కలిగిన వారికి పూర్తి అధికారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులందరూ సర్వే కార్యక్రమంలో పాల్గొని తమ భూముల హక్కులను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో ఎమ్మెల్యే గారు వెంట ఆర్డిఓఏడి ల్యాండ్ సర్వే అధికారులు, స్థానికప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story