షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రవాదులు.. భారత్ వాదన మరోసారి నిరూపణ

by Prasad Jukanti |

మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు లష్కరే తోయిబా కీలక నేతలు హాజరుకావడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రవాదులు.. భారత్ వాదన మరోసారి నిరూపణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇప్పుడు వరల్డ్ పాలిటిక్స్ లో చర్చగా మారాయి. ఈ కార్యక్రమంలో లష్కరే తోయిబా కీలక నేతలు హాజరైనట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‍గా మారాయి. అయితే ఈ వీడియోల్లో పహల్గామ్ ఎటాక్ సూత్రధారి సైఫుల్లా కసూరీ కూడా కనిపించడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛగా, సురక్షితంగా తిరుగుతున్నారనే విషయాన్ని ఈ ఘటన మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసినట్లైందని అంతర్జాతీయ రాజకీయ నిపుణుల్లో చర్చ జరుగుతోంది. అయితే షాహిద్ అక్తర్ జూన్ 24న కన్నుమూశారు. ఇస్లామాబాద్‌లోని హెచ్-8 శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లష్కరే ఉపనేత, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరీతో పాటు పలువురు ఉగ్రవాదులు హాజరు కావడం చర్చగా మారింది.

భారత్ ఆందోళనలు మరోసారి నిరూపణ:

పాకిస్థాన్ ఉగ్రవాదులకు, వారి కార్యకలాపాలకు ఆశ్రయం ఇస్తూ వారికి అండగా ఉంటుందనే వాదన భారత్ చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ పాక్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తూ ప్రపంచం ముందు నమ్మబలికే ప్రయత్నం చేస్తూనే ఉంది. పాకిస్థాన్‌లో సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల కార్యక్రమాల్లో ఉగ్రవాదులు బహిరంగంగా పాల్గొంటున్నా తమ భూభాగంపై ఉగ్రవాదులకు ఎలాంటి ఆశ్రయం లేదంటూ బొంకుతూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఈ ఉగ్రవాదులు ప్రత్యక్షం కావడం హాట్ హాట్ గా మారింది.

Next Story