ఎంపీడీవో, ఏపీఎంలపై కలెక్టర్ ఆగ్రహం

by Bhanu |   (  Updated:2025-11-27 15:45:58  IST  )

శాయంపేట మండలం పత్తిపాక గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవ్యవస్థపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంపీడీవో, ఏపీఎంలపై కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, శాయంపేట : శాయంపేట మండలం పత్తిపాక గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవ్యవస్థపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్, రైతులకు అవసరమైన గిట్టుబాటు ధరల పట్టిక ఫ్లెక్సీ, త్రాగునీరు, టెంట్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకపోవడాన్ని ప్రశ్నించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయకపోవడం, రిజిస్టర్‌, ట్రక్ షీట్‌, గన్నీ సంచుల రికార్డులు సక్రమంగా లేకపోవడం కలెక్టర్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. కేంద్రం ప్రారంభం నుండి ఇప్పటివరకు 7 వేల బస్తాలు కొనుగోలు చేసినా, వాటికి సంబంధించిన ఎలాంటి రికార్డ్ లేదు అని కలెక్టర్ మందలించారు. “మీరు పనిలో నిర్లక్ష్యం చేస్తే మీ స్థానంలో ఎవరైనా పనిచేస్తారు. ప్రభుత్వం కమిషన్ ఇస్తోంది కదా, అయితే బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదు..?” అంటూ కేంద్ర నిర్వాహకులు, సీసీతో పాటు మండల ఏపీఎం వేణుగోపాల స్వామి, ఎంపీడీవో ఫణి చంద్రలను గట్టిగా నిలదీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ నిర్వాహకులు, సీసీ, ఏపీఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఎంపీడీవోను ఆదేశించారు. అలాగే మండల స్థాయి అధికారులు ఇప్పటి వరకు కేంద్రాన్ని పర్యవేక్షించకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యం కొనసాగితే రైతులు నష్టపోవాల్సి ఉంటుంది” అని కలెక్టర్ హెచ్చరించారు.

Next Story