- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాస్టిక్ రహిత మార్కెట్లే లక్ష్యంగా ముందుకు సాగాలి
హన్మకొండ ఎక్సయిజ్ కాలనీ రైతు బజార్ లో ఏర్పాటు చేసిన జూట్, క్లాత్ బయోడిగ్రేడబుల్ బ్యాగుల ప్రత్యేక స్టాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, మార్కెట్లను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయి అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో హన్మకొండ ఎక్సయిజ్ కాలనీ రైతు బజార్ లో ఏర్పాటు చేసిన జూట్, క్లాత్ బయోడిగ్రేడబుల్ బ్యాగుల ప్రత్యేక స్టాల్‌ను గురువారం కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. అందువల్ల ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, బయోడిగ్రేడబుల్ బ్యాగుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. మార్కెట్ ప్రాంతాల్లో వ్యాపారులు, వినియోగదారులు ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా మానుకుని పర్యావరణ హిత ఉత్పత్తులను వినియోగించాలని కోరారు.
ఇకపై మార్కెట్లను దశలవారీగా ప్లాస్టిక్ రహిత మార్కెట్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక స్టాల్ ద్వారా ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రత్యామ్నాయ బ్యాగులు లభిస్తాయని, వాటిని వినియోగించడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారిలో కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో సీఎం హెచ్ ఓ రాజారెడ్డి, ఆర్డీఓ వెంకటేష్, బల్దియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






