మహిళా సంఘాల రుణాల మంజూరుపై క‌లెక్ట‌ర్ కీల‌క ఆదేశాలు

by velandi.Saikiran |

సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మెప్మా ఆధ్వర్యంలో కలెక్టర్ చాహత్ బాజ్ సమావేశం నిర్వహించారు.

మహిళా సంఘాల రుణాల మంజూరుపై క‌లెక్ట‌ర్ కీల‌క ఆదేశాలు
X

దిశ, హన్మకొండ కలెక్టరెట్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసి, స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించే దిశగా మెప్మా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మెప్మా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, మహిళా సంఘాలకు బ్యాంకు అనుసంధాన రుణాల మంజూరులో మరింత పురోగతి సాధించాలని సూచించారు. మహిళా సంఘాలకు రుణాల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.

మడికొండ పారిశ్రామిక పార్కులో మహిళా సంఘాలు, వీధి వ్యాపారులు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. నామమాత్రపు రుసుముతో పరిశ్రమలు స్థాపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్వనిధి పథకం అమలును మరింత వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థుల పాఠశాల యూనిఫాంల కుట్టు పనుల్లో మహిళా సంఘాలు నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించని లబ్ధిదారుల నుంచి నిబంధనల ప్రకారం వసూళ్లు చేపట్టాలని, అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుని ప్రభుత్వ నిధులను తిరిగి రాబట్టాలని అధికారులను ఆదేశించారు.

మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన, పట్టణ పేదల జీవనోపాధి మెరుగుదలే మెప్మా కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కలెక్టర్, ప్రతి పథకం క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇచ్చేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రజితారాణి, పట్టణ మిషన్ కోఆర్డినేటర్లు వెంకట్ రెడ్డి, రమేష్, సతీష్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story