రేపు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసుల గుప్పిట్లో పలు ప్రాంతాలు

by Jakkula.Mamatha |

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పర్యటించనున్నారు.

రేపు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసుల గుప్పిట్లో పలు ప్రాంతాలు
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పర్యటించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మేడారం రానున్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో నూతన డిజైన్ ఖరారు చేయనున్న సీఎం వివిధ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2023 సంవత్సరంలో రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభించింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సోదరిగా భావిస్తూ చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి పార్టీని అధికారంలోకి తీసుకు రావడం విజయం సాధించారు.

అదే తరహాలో రేవంత్ రెడ్డి తల్లుల మీద నమ్మకంతో పాటు తన సోదరిగా భావించే ట్రస్ట్ మంత్రి ధనసరి సీతక్క నియోజకవర్గమైన ములుగు నుంచి 2023 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన పాదయాత్ర ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ఎనలేని విజయాన్ని సాధించారు. 2024 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో తల్లులను దర్శించుకున్న సీఎం 2026 సంవత్సరంలో జరిగే మహా జాతర వరకు మేడారం రూపురేఖలు మార్చడం జరుగుతుందని ప్రకటించారు. ఆదివాసీ గిరిజనులు, భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా గడ్డల ప్రాంతాన్ని తీర్చిదిద్దడం తో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈసారి జరిగే మహా జాతరకు ఏకంగా 150 కోట్ల రూపాయలను కేటాయించారు.

మహా జాతర విజయవంతం కోసం గద్దెల ప్రాంత డిజైన్ ఖరారు చేయడమే కాకుండా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆర్కియాలజీ అధికారులతో పాటు మంత్రులతో పలుసార్లు సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంగళవారం 12 గంటలకు సీఎం మేడారం చేరుకుంటారని, పనుల పర్యవేక్షణ కోసం వస్తున్న ముఖ్యమంత్రి తిరిగి జాతర సమయంలో అమ్మవార్లను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. సమైక్య రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన అనంతరం రెండు సార్లు ఏ ముఖ్యమంత్రి అమ్మవార్లను దర్శించుకున్న దాఖలా లేవు. జిల్లాలో పర్యటన సందర్భంగా సీఎం జిల్లాకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే.

పోలీసుల గుప్పిట్లో మేడారం ప్రాంతాలు

రేపు సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నది. దాదాపు 200 మంది పోలీసులను మేడారం పరిసర ప్రాంతాల్లో బండ బతుకు కోసం నియమించగా ప్రత్యేక పోలీసు బలగాలు దట్టమైన అటవీ ప్రాంతంలో అడుగడుగున జల్లెడ పడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో నిత్యం మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరుగుతున్న సందర్భంలో వరుస ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. సీఎం పర్యటన ఈనెల 16నే ఉండగా ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయన పర్యటనలు రద్దు చేసినట్లు తెలిసింది. తిరిగి ఈనెల 23న ముఖ్యమంత్రి పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం తో పాటు ఇతర జిల్లాల పోలీసులు మేడారంలో తిష్ట వేశారు.

రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదివారం నుంచి మేడారంలో ఉంటూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. గుత్తేదారులకు వరంగా మారుతున్న మేడారం పనులు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం మహా జాతరను పురస్కరించుకుని పాలకులు, భక్తుల సౌకర్యార్థం కోసం వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుండగా ఆయా పనులు కాంట్రాక్టర్లకు వరంగా మారుతున్నాయి. 1996లో అప్పటి ప్రభుత్వం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించగా ఆ సమయంలో నామమాత్రంగా నిధులు కేటాయించి పనులు చేయించారు. 2006 సంవత్సరం నుండి గత జాతర వరకు (2024) 696 కోట్ల 50 లక్షల రూపాయలు కేటాయించగా ప్రస్తుతం మేడారంలో భవనాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.

జంపన్న వాగు పై స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ జాతర సమయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి జంపన్న వాగులో నల్లాలను ఏర్పాటు చేస్తున్న అధికారులు జాతర ముగిసిన అనంతరం వాటిని తీసి వేస్తున్నారు. తిరిగి జాతర వచ్చిందంటే చాలు పాత నల్లాలనే ఏర్పాటు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. గోవిందరావుపేట మండలం పసర గ్రామం నుండి నార్లాపూర్ మీదుగా జంపన్న వాగు వరకు ఏర్పాటు చేసిన రోడ్డు మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోతున్నది. రోడ్డు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే గుంతలు ఏర్పడడం, భారీ వర్షాల కారణంగా దెబ్బతినడం జరుగుతుంది. నాసిరకంగా పనులు చేయడం వలనే ఏ పని శాశ్వతంగా ఉండడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈసారి చేపట్టే పనులు 1000 సంవత్సరాల పాటు నిలిచిపోయేలా చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. ఈసారైనా శాశ్వతంగా నిలిచేలా పనులు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Next Story