- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ రంగంలో మార్పులకు తొలి మెట్టుగా పంటల మార్పు ఉండాలి
వ్యవసాయ రంగంలో మార్పులకు తొలి మెట్టుగా పంటలు మార్పిడి ఉండాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : వ్యవసాయ రంగంలో మార్పులకు తొలి మెట్టుగా పంటలు మార్పిడి ఉండాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం- వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా ఘనంగా నిర్వహించారు. మెగా రైతు మేళా సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డగా రైతుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు అవసరమని, పంటల మార్పిడి ద్వారా రైతులు లాభదాయక సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు. రాష్ట్రంలో వరి, పత్తి పంటలపై అధిక ఆధారపడటం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశముందని, ఉద్యాన మరియు వాణిజ్య పంటల వైపు రైతులు మళ్లాలని అన్నారు.
కోతుల బెడదతో అనేక భూములు పాడవుతున్నాయని, చిన్న రైతులకు ఫెన్సింగ్ సబ్సిడీ ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. రైతులు సంఘటితంగా ఉండి దళారుల దోపిడీకి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రసాయనిక ఎరువులు, ప్రమాదకర పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు మార్గదర్శనం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు మరింత లాభం కలుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేయడానికి మెగా రైతు మేళా వేదికగా నిలిచిందని అన్నారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని రైతులకు సూచించారు. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలపైనే ఆధారపడకుండా పప్పు ధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని కోరారు. నాణ్యమైన విత్తనాలు, శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేయడం ద్వారా దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెగా రైతు మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించి, రైతులతో మాట్లాడి పంటలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఆధునిక పద్ధతులపై రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, ఆర్డీవో రాథోడ్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఉద్యాన అధికారి అనసూయ పాల్గొన్నారు.






