- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం
2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు కీలకమని కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు.

దిశ, జనగామ : 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు కీలకమని కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో జనాభా గణన-2027ను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జనాభా గణన నిర్వహణలో ప్రభుత్వం జారీ చేసిన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ (ఇళ్ల జాబితా), గృహాల గణన మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్నారు. రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని, మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించేందుకు జనాభా గణన ద్వారా లభించే గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈసారి దేశంలో తొలిసారిగా జనాభా గణనను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌ల ద్వారా గణన ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజలు తమ వివరాలను తామే ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా, గృహాల గణనలో ఇంటి నిర్మాణం, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగు నీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలపై మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరిస్తారని తెలిపారు.అనంతరం శిక్షణ నిర్వాహకులు, సీపీఓ చినకోట్యా నాయక్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు.అలాగే గణాంక అధికారులు రవి నాయక్, హిమ వర్ష ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి, గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలి అనే అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఆర్డీవోలు, ఎంపిడిఓలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.






