ప్రజలకు సత్వర న్యాయం అందేలా కేసుల దర్యాప్తు చేయాలి: పోలీస్ కమిషనర్

by Taduka Kalyani |

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు.

ప్రజలకు సత్వర న్యాయం అందేలా కేసుల దర్యాప్తు చేయాలి: పోలీస్ కమిషనర్
X

దిశ వరంగల్ బ్యూరో : ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. స్థానిక కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) కళాశాల సమావేశ ప్రాంగణంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల నేరాలు, వాటి దర్యాప్తు పురోగతి, కేసుల ఛేదన, పెండింగ్ కేసుల స్థితి, శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, కేసుల్లో నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు . చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును చట్టపరమైన ప్రక్రియ అనంతరం బాధితులకు త్వరగా అందించే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మాదకద్రవ్యాల నియంత్రణ లో భాగంగా పాఠశాలల పరిసరాల్లో గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందే ప్రతి పిటిషన్‌ను తప్పనిసరిగా నమోదు చేసి, వెంటనే విచారణ అధికారిని నియమించి నిర్ణీత గడువులో నాణ్యమైన విచారణ పూర్తి చేయాలని తెలిపారు. డయల్ 100 ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు.అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ఎఫెక్టివ్ పోలీసింగ్ అమలు చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. భూ వివాదాలకు సంబంధించిన కేసుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎసఓపీ)లిను ఖచ్చితంగా పాటిస్తూ చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి, అవసరమైన చోట రౌడీ షీట్లు తెరవాలని, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించిన వరంగల్ పోలీస్ కమిషనర్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ చోరీకి గురైన, పోగొట్టుకున్న సుమారు 50 లక్షల రూపాయల విలువ గల 352 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి స్వాధీనం చేసుకొని మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత చేతుల మీదుగా బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. ఎవరైనా సెల్ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన బాధితులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.బాధితుల సెల్ ఫోన్లను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన ఐటీ సెల్ బృందాన్ని పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో డిసిపిలు అకింత్ కుమార్, ధారా కవిత, రాజమహేంద్ర నాయక్, కిషోర్ సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ అధికారులు (ఎస్‌హెచ్‌వోలు), ప్రత్యేక విభాగాల అధికారులు, కమిషనరేట్‌కు చెందిన ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Next Story