- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థుల్లో బీ-ఫామ్ టెన్షన్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది. దీంతో నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో ఇప్పుడు ‘బీ-ఫామ్’ టెన్షన్ పట్టుకుంది. ఉపసంహరణకు కేవలం రెండే రోజులు గడువు ఉండడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నుంచి బరిలో నిలిచిన ఆశావహులు తమకే టికెట్ దక్కాలని నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 230 వార్డులకు గానూ వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలు కావడంతో తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడం ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక బలం, సామాజిక సమీకరణాల ఆధారంగా చైర్మన్ పీఠాలపై కన్నేసి వ్యూహాలు రచిస్తోంది. సర్వేల నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అధిష్టానం స్పష్టం చేయడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. ఈ క్రమంలోనే ఈ నెల 8న ముఖ్యమంత్రి భూపాలపల్లి పర్యటన ఖరారు కావడంతో ప్రచార పర్వం మరింత వేడెక్కనుంది. తుది జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయో, ఎవరికి మొండిచేయి ఎదురవుతుందో తెలియక అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో గడుపుతున్నారు.
దిశ, వరంగల్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఇప్పుడు బీ-ఫామ్ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ అధికారిక గుర్తింపు పత్రం (బీ-ఫామ్) తమకే వస్తుందనే నమ్మకంతో బరిలో నిలిచిన నేతలు, నామినేషన్ల ఉపసంహరణకు మరో రెండు రోజులే గడువు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేయడంతో అభ్యర్థులు తమ బలాబలాలను నిరూపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
12 మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు..
ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీల్లో మొత్తం 230 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో కొన్ని వార్డుల్లో ఒకటికి మించి నలుగురు వరకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరకాల మున్సిపాలిటీలో 174 మంది, నర్సంపేటలో 245 మంది, మహబూబాబాద్‌లో 113మంది నామినేషన్లు వేశారు. అలాగే భూపాలపల్లిలో 166, జనగామలో 186, స్టేషన్ ఘన్‌పూర్‌లో 114 మంది బరిలో నిలిచారు. ఈ భారీ సంఖ్యను చూస్తుంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.
ఎమ్మెల్యేలకు తప్పని బుజ్జగింపుల పర్వం...
బలమైన నేతలతోపాటు పట్టులేని నేతలు కూడా నామినేషన్లు వేయడంతో వారిని విత్‌డ్రా చేయించడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. పైరవీల వల్ల చివరి నిమిషంలో తమకు రావాల్సిన బీ-ఫామ్ ఎక్కడ వేరే వారికి వెళ్తుందోనని అభ్యర్థులు భయపడుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్‌లోనూ పాత కౌన్సిలర్లు, కొత్తగా వచ్చిన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొన్నది. ఇరు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శ్రమిస్తున్నారు.
చైర్మన్ పీఠాలపై కాంగ్రెస్ ఫోకస్...
మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఆర్థిక బలం, రిజర్వేషన్ అనుకూలత కలిగిన నేతలను ఇప్పటికే గుర్తించి బరిలోకి దించింది. చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినా, ఎమ్మెల్యేలు వారికి హామీలు ఇస్తూ ఎన్నికల ఖర్చును భరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ముగింపు ఘట్టానికి సీఎం పర్యటన...
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న ముఖ్యమంత్రి భూపాలపల్లికి రానున్నారు. సీఎం పర్యటనతో క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు స్థానిక ఎమ్మెల్యే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాకతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకోనుంది.






