తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖేల్ ఖతం

by velandi.Saikiran |   (  Updated:2026-07-08 12:17:24  IST  )

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ ఎంపీ సీతరాం నాయక్ జోస్యం పలికారు.

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖేల్ ఖతం
X

దిశ, మరిపెడ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ ఎంపీ అజ్మీర సీతరాం నాయక్ జోస్యం పలికారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల పని ముగిసిందని, ఓ వైపు కేసీఆర్ ఫాం హౌస్ లో చుక్కలు లెక్కపెడుతుండని, మరో వైపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంతో చెప్పలేమన్నారు. బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరంగల్ జిల్లా కేంద్రంగా రాష్ట్రంలో ఉన్న 7తెగలకు చెందిన ప్రతినిధులను పిలిచి వారికి గడచిన 12ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన అభ్యున్నతిని వివరించారన్నారు. అదే వేదికలో బూత్ అధ్యక్షులను, బీఎల్ఏలు సుమారు 7వేల మందితో చర్చించారన్నారు. గతంలో జాతీయ పార్టీలకు చెందిన ఏ అధ్యక్షులు కూడా గిరిజన నాయకులను సమావేశపర్చిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణలో ప్రభుత్వాల ఏర్పాటులో గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అనేక దఫాలు ఊటంకించినట్లు గుర్తు చేశారు.

అయితే పదే పదే లంబాడీలు కీలకం అంటూనే తెలంగాణ సీఎం ఆ జాతికి సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా వర్గాల మధ్య సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. తెలంగాణలో లంబాడీలను ఎస్టీ జాబితాలో ఇందిరా కాంగ్రెస్ కలిపి 50ఏళ్లు అయినందుకు సర్ణోత్సవాలు చేస్తూ, మరో వైపు మరో వర్గానికి మంత్రి సీతక్క ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే సభలో మద్దతు పలకడం దారుణమన్నారు. సోయం బాబురావు, తెల్లం వెంకట్రావులను బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకుని సుప్రిం కోర్టులో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పిల్ వేయించటం సరైంది కాదన్నారు. ఇందిరా కాంగ్రెస్ లోనే సభ్యులే స్వర్ణోత్సవాలు జరుపుతూ, మరో వైపు సుప్రిం కోర్టులో తొలగించాలని కోరటం వారి ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. లంబాడీల జాతిని ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. 37మంది గిరిజన పిల్లల బలిదానల మీద ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి లంబాడీలను విస్మరించటం సరికాదన్నారు. 7శాతం ఉన్న లంబాడీలకు మంత్రి ఇవ్వకుండా తాత్సారం చేయటం ఏమిటని ప్రశ్నించారు.

మాజీ మంత్రి సత్యవతి వ్యాఖ్యలు శోచనీయం..

బీజేపీ జాతీయ అధ్యక్షుడి పట్ల మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలు శోచనీయమన్నారు. గిరిజనుల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోదంన్నారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, ఏయిర్ పోర్టు, కోచ్ ఫ్యాక్టరీ, వలిగొండ - భద్రాచలం జాతీయ రహదారి, 9కేంద్రీయ విద్యాలయాలు, మణుగూరు నుంచి రామగుండం 227 రూ.8515కోట్లతో మణుగూరు, గోపాలపురం, తాడ్వాయి, మేడారం, భూపాలపల్లి రైల్వే లేన్ పనులు చేస్తోందన్నారు. ఇన్ని చేసినా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు కనిపించకపోవటం శోచనీయమన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావటం అసాధ్యమని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోను గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఏగురవేస్తామని, గిరిజనులు మోది పట్ల ఆదరణ చూపాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నియోజవకర్గ ఇంచార్జి శంకర్ నాయక్, బీజేపీ మండల అధ్యక్షుడు కట్టోజు గంగాధర్, పట్టణ అధ్యక్షురాలు భూక్య మంగమ్మ లింగం, భూక్య సుధాకర్ నాయక్, భూక్య కాంతమ్మ, పులి శ్రీనివాస్, వీరన్న, లింగం నాయక్, నాగరాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story