Microsoft : ఏఐ ఖర్చు భరించలేక మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం

by Ramesh Naini |

ఆర్థిక భారాలను తగ్గించుకునే క్రమంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక అడుగులు వేస్తోంది.

Microsoft : ఏఐ ఖర్చు భరించలేక మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్థిక భారాలను తగ్గించుకునే క్రమంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక అడుగులు వేస్తోంది. ఓపెన్ ఏఐ (OpenAI), ఆంత్రోపిక్ (Anthropic) వంటి ఇతర సంస్థల ఏఐ మోడల్స్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, తమ అంతర్గత అవసరాల కోసం సొంతంగా అభివృద్ధి చేసిన ‘ఎంఏఐ’ (MAI) మోడల్స్‌ను వినియోగించడం ప్రారంభించింది. తాజా నివేదికల ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ (Excel), అవుట్‌లుక్ (Outlook) వంటి సాఫ్ట్‌వేర్లలో ప్రతివారం వస్తున్న వేలాది ఏఐ ప్రాంప్ట్‌లను ప్రస్తుతం ఈ ఎంఏఐ (MAI) మోడల్స్ ద్వారానే అంతర్గతంగా నిర్వహిస్తున్నారు. గతంలో ఈ పనుల కోసం చాట్‌జీపీటీ, క్లాడ్ (Claude) మోడల్స్‌ను ఉపయోగించేవారు. ప్రస్తుతం ఇది తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ, అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ పనితీరు కనబరిచే సొంత ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో మైక్రోసాఫ్ట్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనం.

పెరుగుతున్న ‘టోకెన్’ ఖర్చులు..

యూజర్లు ఏఐ అసిస్టెంట్ ద్వారా ఈమెయిల్స్ రాయడం, డేటా విశ్లేషణ లాంటివి చేసినప్పుడల్లా భారీ స్థాయిలో ‘టోకెన్స్’ (కంప్యూటింగ్ పవర్) ఖర్చవుతాయి. కో పైలట్ (Copilot) ద్వారా మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం అత్యధికంగా ఈ టోకెన్లను వినియోగిస్తోంది. ఓపెన్ ఏఐతో ఉన్న భాగస్వామ్య ఒప్పందం వల్ల ప్రస్తుతం తక్కువ ధరకే సేవలు లభిస్తున్నప్పటికీ, ఈ వెసులుబాటు శాశ్వతం కాదని సంస్థ భావిస్తోంది. ఇతర ల్యాబ్స్ ధరల నిర్ణయంపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐలకు భారీగా డబ్బులు చెల్లిస్తున్నామని, దాన్ని పూర్తిగా తగ్గించాలన్నదే తమ లక్ష్యమని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ గత జూన్‌లోనే స్పష్టం చేశారు.

కొత్త మోడల్స్ విస్తరణ..

మైక్రోసాఫ్ట్ ఇటీవల 7 కొత్త ఇన్-హౌస్ ఏఐ మోడల్స్‌ను ప్రదర్శించింది. వీటిలో ఒక మోడల్ అత్యంత తక్కువ ఖర్చుతోనే ఆంత్రోపిక్ ‘ఓపస్ 4.6’ మోడల్‌కు సమానంగా కోడింగ్ చేయగలదని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ సొంత ఏఐ టెక్నాలజీని ఆఫీస్ పనులకే పరిమితం చేయకుండా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం ‘గిట్‌హబ్ కోపైలట్’ (GitHub Copilot)కు కూడా విస్తరించారు. రాబోయే నెలల్లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Teams) సహా ఇతర ప్రధాన ఉత్పత్తులలోకి సొంత వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ మోడల్‌ను కూడా తీసుకురానున్నట్లు సులేమాన్ ధృవీకరించారు.

Next Story