- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల ఫిట్‌నెస్‌కు క్రీడలే బలమైన పునాది : డీజీపీ సి.వి. ఆనంద్
విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడికి గురయ్యే పోలీసుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఆవశ్యకమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు.

దిశ,తెలంగాణ బ్యూరో: విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడికి గురయ్యే పోలీసుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఆవశ్యకమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2026 బుధవారం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఐ గోవిందరెడ్డికి స్పోర్ట్స్ టార్చ్‌ను అందజేసి డీజీపీ క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.
సమయ వృథాగా భావించొద్దు..
ఈ సందర్భంగా డీజీపీ ఆనంద్ మాట్లాడుతూ.. "నాకు గోల్ఫ్ ఆడటం ధ్యానం చేసినంత ప్రశాంతతను ఇస్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా క్రీడలు నాకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి. నేను ఒకరోజు పోలీసింగ్‌ను ఆపవచ్చేమో కానీ.. క్రీడలు ఆడటం మాత్రం ఎప్పటికీ ఆపను. క్రీడలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమయ వృథాగా భావించవద్దు" అని అన్నారు. ప్రతి యూనిట్‌లోని ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. గతేడాది అఖిల భారత పోలీస్ క్రీడల్లో తెలంగాణ బృందం 21 పతకాలు సాధించిందని, ఆ సంఖ్యను, ముఖ్యంగా బంగారు పతకాలను మరింత పెంచేలా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తొలిసారిగా ఐదు క్లస్టర్లలో..
గత 35 ఏళ్లుగా రాష్ట్ర పోలీస్ క్రీడలను ఒకే వేదికపై నిర్వహించే ఆనవాయితీకి ఈ ఏడాది స్వస్తి పలికినట్లు డీజీపీ వెల్లడించారు. జాతీయ స్థాయి స్పోర్ట్స్ తరహాలో.. ఐదు క్లస్టర్లుగా విభజించి ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది సిబ్బందికి క్రీడల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు. మొత్తం 21 జట్లతో 34 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. క్లస్టర్ ఏ పోటీలు జులై 7 నుంచి 9 వరకు సరూర్‌నగర్‌లో బాక్సింగ్, రెజ్లింగ్ తదితర 14 ఇండోర్ క్రీడలు, క్లస్టర్ బీ టీ20 క్రికెట్ పోటీలు నవంబర్ 17 నుంచి 19 వరకు ఫ్యూచర్ సిటీలో జరగనున్నాయి. క్లస్టర్ సీ పోటీలు టెన్నిస్, బ్యాడ్మింటన్ సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు తెలంగాణ పోలీస్ అకాడమీలో, క్లస్టర్ డీ వాలీబాల్,కబడ్డీ నవంబర్ 3 నుంచి 5 వరకు, క్లస్టర్ ఈ సైక్లింగ్, ఆర్చరీ, రోయింగ్, నవంబర్ 25 నుంచి 28 వరకు నిజామాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించనున్నట్లు వివరించారు.ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక శిక్షణ, కోచింగ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ. 3 లక్షల నగదు బహుమతితో పాటు మూడు ప్రత్యేక ఇంక్రిమెంట్లు, వెండి పతకం సాధిస్తే రూ. 2 లక్షల నగదు, రెండు ప్రత్యేక ఇంక్రిమెంట్లు, కాంస్య పతకం నెగ్గితే రూ. లక్ష నగదు బహుమతి సహా ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను అందజేస్తామని ప్రకటించారు.
ఆపదలో ముందుగా గుర్తొచ్చేది పోలీసులే..
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా దేవుడు, ఆ తర్వాత పోలీసులే గుర్తుకు వస్తారని కొనియాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో పాల్గొనడమే ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సీపీ సుమతి,హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐజీ గజారావు భూపాల్‌తో పాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు, పోలీసు క్రీడాకారులు, పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






