పెరుగుతున్న ప్రైవేటీకరణ ప్రమాదం: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

by Kodari Anjali |

నిరంతర అధ్యయనం, అలుపెరగని ప్రజా పోరాటాలతోనే ప్రత్యామ్నాయం సాధ్యమవుతుందని మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

పెరుగుతున్న ప్రైవేటీకరణ ప్రమాదం:  మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, భద్రాచలం: నిరంతర అధ్యయనం, అలుపెరగని ప్రజా పోరాటాలతోనే ప్రత్యామ్నాయం సాధ్యమవుతుందని మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భద్రాచలంలో జరుగుతున్న సీపీఐ రాజకీయ శిక్షణా తరగతుల్లో భాగంగా బుధవారం ఆయన సీపీఐ ఎదుర్కొంటున్న సవాళ్లు, అధిగమించే మార్గాలు అనే అంశాన్ని బోధించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటితరం కమ్యూనిస్టు నాయకులు కమ్యూనిజాన్ని అధ్యయనం చేసి దేశ పరిస్థితులకు అన్వయించారని ఆయన తెలిపారు. పాలనలో వస్తున్న మార్పులు, తగ్గిన ప్రజా సంబంధాలు, ప్రజల ఆలోచనా విధానంతో కమ్యూనిస్టు పార్టీలు కొత్త సవాళ్లును ఎదుర్కుంటున్నాయన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, తర్వాత ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. అది క్రమేపీ ఇప్పుడు హక్కుల హవనానికి, సంఘాల నిషేధానికి దారితీస్తుందన్నారు. ఇదే సమయంలో దేశ సంపద కొందరి చేతుల్లోనే పోగుపడుతోందని ఆయన తెలిపారు.

ఎజెండా అనే అంశాన్ని...

బీజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరిస్తోందని, భవిష్యత్లో ప్రభుత్వ రంగం లేకపోతే ఉద్యోగ ఉపాధి కల్పన రంగాలకు రిజర్వేషన్లకు పెనుముప్పు రానుందని ఆయన చెప్పారు. గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతం చేయడం ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించవచ్చని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ శిక్షణ తరగతుల్లో భారతీయ చరిత్ర, సంస్కృతి ఆర్ఎస్ఎస్ వక్రీకరణ అనే అంశాన్ని డి సోమసుందర్, పార్టీ కార్యక్రమం అనే అంశాన్ని యుగల్ రాయలు, మతం మతోన్మాదం, కేంద్ర ప్రభుత్వం మతోన్మాద ఎజెండా అనే అంశాన్ని ఎస్ వేణుగోపాల్ బోధించారు. ఈ శిక్షణా తరగతులకు జమ్ముల జితేందర్ రెడ్డి ప్రిన్సిపాల్, కల్లూరి వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపల్ గా వ్యవహరించగా సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story