- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో.. పాల్వంచ అధికారులకు ఏదైనా సాధ్యమేనా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మొండికట్ట గ్రామంలో విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదంలో మృతి చెందిన ఆదివాసి యువకుడు కోరం నాగవర్ధన్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

దిశ, పాల్వంచ(టౌన్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మొండికట్ట గ్రామంలో విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదంలో మృతి చెందిన ఆదివాసి యువకుడు కోరం నాగవర్ధన్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ ఘటనపై దిశలో ప్రచురితమైన ప్రాణం ఖరీదు ఆరు లక్షలా..? కథనం తర్వాత బయటపడుతున్న వివరాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
ఆధార్‌లో 17 ఏళ్లు.. ఎఫ్‌ఐఆర్‌లో 19 ఏళ్లు..
మృతుడు కోరం నాగవర్ధన్ ఆధార్ కార్డు ప్రకారం 17 సంవత్సరాల వయస్సు గల మైనర్. అయితే పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం అతని వయస్సు 19 సంవత్సరాలుగా నమోదు చేసినట్లు సమాచారం. ఈ వ్యత్యాసం ఇప్పుడు కేసులో కీలక అంశంగా మారింది.ఒకవేళ బాలుడు నిజంగా మైనర్ అయితే, అతడిని ప్రమాదకర విద్యుత్ పనుల్లో నియమించడం తీవ్రమైన చట్ట ఉల్లంఘన అవుతుంది. అందుకే ఈ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే వయస్సు మార్చి చూపించారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కాంట్రాక్టర్‌ను కాపాడేందుకే వయస్సు మారిందా?
కేసులో ప్రధాన ఆరోపణ ఏమిటంటే... కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు కలిసి మృతుడిని మేజర్‌గా చూపించే ప్రయత్నం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలా చేస్తే బాల కార్మిక చట్టాలు, ఇతర నిబంధనల ఉల్లంఘన అంశాలు బలహీనపడే అవకాశం ఉండటంతో ఈ మార్పు జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీజన్ పేరుతో కాంట్రాక్టర్ వ్యవహారం?
స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, ట్రాన్స్‌కోలో ఆర్టీజన్‌గా పనిచేస్తున్న వ్యక్తి కాంట్రాక్టర్ తరహాలో వ్యవహరిస్తూ, తన స్థానంలో ఇతరులను పనులకు పంపిస్తూ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంబంధిత అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఈ వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. నాగవర్ధన్ మృతితో ఈ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం దక్కుతుందా?
మైనర్ బాలుడిని ప్రమాదకర విద్యుత్ పనుల్లో నియమించడం నిజమైతే, అది తీవ్రమైన చట్ట విరుద్ధ చర్య. అంతేకాకుండా ప్రమాదం అనంతరం వాస్తవాలను దాచిపెట్టి, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగి ఉంటే బాధ్యులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయడంతో పాటు, ఘటనకు బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్ పాత్రపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని జిల్లా ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు.
పాల్వంచ రూరల్ ఎస్‌ఐ సురేష్ వివరణ..
ఈ వ్యవహారంపై పాల్వంచ రూరల్ ఎస్‌ఐ సురేష్ స్పందిస్తూ, మృతుడి వయస్సు విషయంలో ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ఆధార్‌లో వయస్సు వేరుగా ఉన్న అంశం మా దృష్టికి ఇప్పుడే వచ్చింది. పూర్తి స్థాయిలో విచారణ చేసి, అవసరమైతే కేసు రికార్డుల్లో తగిన సవరణలు చేస్తాం. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరు తప్పు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు అని తెలిపారు.






