ఇరిగేషన్​ ఇష్టారాజ్యం..!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-11 02:09:28  IST  )

నీటి పారుదల డివిజన్ శాఖలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడం విమర్శలకు కారణం అవుతోంది. కార్యాలయంలో ఉండాల్సిన సిబ్బంది సైతం ఫీల్డ్ పేరిట గైర్హాజరవుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. నర్సంపేట పట్టణంలోని ఉప కార్యనిర్వహక ఇంజినీర్​ కార్యాలయం, సబ్ డివిజన్ నెంబర్ 1 కార్యాలయ సిబ్బంది పాకాల ఆయకట్టు కాల్వలపై పనిచేస్తున్నారు.

ఇరిగేషన్​ ఇష్టారాజ్యం..!
X

దిశ, నర్సంపేట: నీటి పారుదల డివిజన్ శాఖలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడం విమర్శలకు కారణం అవుతోంది. కార్యాలయంలో ఉండాల్సిన సిబ్బంది సైతం ఫీల్డ్ పేరిట గైర్హాజరవుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. నర్సంపేట పట్టణంలోని ఉప కార్యనిర్వహక ఇంజినీర్​ కార్యాలయం, సబ్ డివిజన్ నెంబర్ 1 కార్యాలయ సిబ్బంది పాకాల ఆయకట్టు కాల్వలపై పనిచేస్తున్నారు. సిబ్బంది ఉద్దేశపూర్వక గైర్హాజరుతో పాకాల పంట కాల్వల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు కాల్వల పనులు చేసిన వారికి డబ్బులు రాకపోవడం, పర్యవేక్షణ కొరవడటం వెరసి పాకాల ఆయకట్టు కింద సేద్యం చేస్తున్న రైతన్నలకు నీరు చివరి దాకా అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.

తూతూ మంత్రంగా పనులు...

క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న లష్కర్లు అనుకున్న మేర పని చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. పంట కాల్వల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, లైనింగ్ సరిగా చేయకపోవడం ప్రధాన సమస్యగా మారింది. లష్కర్లు బుర్రలు కట్టడం, చెత్తను శుభ్రం చేస్తూ చివరి ఆయకట్టు వరకు నీరు పారేలా చూడాల్సి ఉంది. ఇక్కడ సమస్య ఎదురైతే వర్క్ ఇన్​స్పెక్టర్లు పర్యవేక్షణ చేసి సదరు కాలువ ఏఈఈలకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అనంతరం ఏఈఈ లు పరిశీలన చేసి డీఈ లకు రిపోర్ట్ అందివ్వాలి. ఈ నివేదికలను బట్టి ఎస్ఈ ఆదేశాలతో పెండింగ్ పనులను చేపట్టాల్సి ఉంటుంది. కాగా సమన్వయం, పర్యవేక్షణ లోపం కారణంగా పంట కాల్వల పనుల్లో పురోగతి లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది.

ఆఫీస్ సిబ్బంది ఫీల్డ్ లోనే..?

నర్సంపేట ఇరిగేషన్ కార్యాలయంలో పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఉండాల్సిన సిబ్బంది (జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్) సైతం కార్యాలయంలో ఉండకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీరు కూడా ఫీల్డ్ మీదనే ఉంటున్నట్లు సిబ్బంది చెప్పడం ఇరిగేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవకతవకలకు అద్దం పడుతోంది.

సిబ్బంది కొరతతో సమస్య మరింత జటిలం..

నర్సంపేట పట్టణంలోని ఇరిగేషన్ సబ్ డివిజన్ లో సిబ్బంది కొరత సైతం ఉద్యోగులను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పాకాల పంట కాల్వల కోసం ఒక డీఈ, ముగ్గురు ఏఈఈలు, ఇద్దరు వర్క్ ఇన్​స్పెక్టర్లు , ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినెట్, హెల్పర్ సహా 18మంది లష్కర్లు ఉండాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఐదుగురు లష్కర్లు పని చేస్తున్నారు. ఒక వర్క్ ఇన్​స్పెక్టర్, ఒక ఏఈఈ ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ..

ఇరిగేషన్ కార్యాలయ సిబ్బందిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువుతున్నట్లు తెలుస్తోంది. పాకాల ఆయకట్టు కింద ఖానాపురం, నర్సంపేట , చెన్నారావుపేట, గుడూరు ప్రాంత రైతులు సాగు చేస్తున్నారు. పాకాల జలాశయం కింద వేలాది ఎకరాల్లో వరి సాగవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకాల కాలువలపై శ్రద్ధ చూపకపోవడంతో కాలువలు పూర్తిగా దెబ్బతిని, కట్టలు అధ్వానంగా మారాయి. పాకాల ఆయకట్టు జాలుబంధం, తుంగబంధం, సంగెం అలాగే పాకాల వాగు ద్వారా సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంటుంది. సమగ్ర పర్యవేక్షణ లోపంతో పాకాల కాలువలో చెత్త పేరుకుపోయింది. పంట కాల్వలలో మొక్కలు పెరిగాయి. దీనికి పరిష్కారంగా లైనింగ్ చేపట్టి కాలువలో నీరు సాఫీగా వెళ్లేలా చూడాలి. కానీ అలాంటి చర్యలకు వివిధ స్థాయిల్లో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా సరైన సమయంలో నీరు అందక వేసిన పంటలు దెబ్బతింటున్నాయి. చాలా చోట్ల కాలువ ఇరువైపులా ఆక్రమణలు ఉండడంతో కట్ట విస్తీర్ణం తగ్గింది. దారి ఇరుకుగా మారింది. రోజువారీగా లష్కర్లు ఫీల్డ్ కి వెళ్తున్నప్పటికీ సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. కార్యాలయ సిబ్బందికి ఫీల్డ్ సిబ్బందికి సమన్వయ లోపం ఎదురవడం, కార్యాలయ సిబ్బందిపై మానిటరింగ్ లేకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదన్నది శాఖ ఉద్యోగుల నుంచి వ్యక్తం అవుతోంది. మరోవైపు ఫీల్డ్ వర్క్ కావడంతో వీరికి బయోమెట్రిక్ లేకపోవడం అవినీతికి చేయూత నిచ్చినట్టు అవుతోంది. ఈ ఘటనలపై ఇరిగేషన్ ఈఈని వివరణ కోరగా ఉద్యోగుల సమయపాలన, గైర్హాజరు సంగతి తన దృష్టికి రాలేదని, తెలుసుకుంటానని అన్నారు.

Next Story