- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Agriculture Commission: భూ భారతితో సమస్యల పరిష్కారం..
భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఎంతో దోహదపడుతుందని చట్టం రూపకర్త, వ్యవసాయ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ అన్నారు.

దిశ, పాలకుర్తి(కొండకల్): భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఎంతో దోహదపడుతుందని చట్టం రూపకర్త, వ్యవసాయ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ అన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించినట్లు చెప్పారు. పాలకుర్తిలో లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో ఈ చట్టాన్ని తయారు చేశామన్నారు. గతానికి భిన్నంగా టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ వివాదాల్లేని భూ రికార్డులను తయారు చేసే విధంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి భూ కమతానికి అక్షాంశాలు, రేఖాంశాలతో సరిహద్దుల మ్యాపులు రానున్నాయన్నారు. 14 ఏండ్ల తర్వాత ప్రజల అభిప్రాయాలను సేకరించి, చేర్పులు/మార్పుల ద్వారా ఆర్వోఆర్ చట్టాన్ని తయారు చేసినట్లు గుర్తు చేశారు.
భూమి ఉన్న ప్రతి రైతుకు ఈ చట్టం ద్వారా న్యాయం అందుతుందన్నారు. అలాగే అధికారాలను కూడా వికేంద్రీకరించాలని చట్టంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ అనేక చర్యలను తీసుకుంటుందన్నారు. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ, భూ హక్కుల పరిరక్షణ, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలు ఎలా సులభతరం అవుతాయో వివరించారు. రైతులు ఈ చట్టం ద్వారా పొందగల ప్రయోజనాలను వివరించారు. శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ రైతులు హక్కులు, భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని, భూ హక్కుల పరిరక్షణకు ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు. రైతులు తమ భూములపై పూర్తి హక్కులను పొందేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని వివరించారు.
చట్టంపై అవగాహన పెంచుకోవాలి.. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ.. భూ సంస్కరణలు అనేకం వచ్చాయన్నారు. రైతుల హక్కులను పరిరక్షించడానికి భూ చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. భూ భారతి చట్టం ఈ మార్పులకు దోహదం చేస్తుందని తెలిపారు. రైతుల హక్కులు మరియు భూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భూ సంస్కరణలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సదస్సుకు ముఖ్య అతిధులుగా పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, లీఫ్స్ సంస్థ అడ్వయిజర్ కరుణాకర్ దేశాయ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ కుమార్ సింగ్, ఆర్డీవోలు, ఎమార్వోలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, రైతు సోదరులు, యువ నాయకులు, యువ రైతులు, మహిళ రైతులు పాల్గొన్నారు.






