ఫర్టిలైజర్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి

by Elthuri vijay kumar |

ఫర్టిలైజర్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి
X

ఫర్టిలైజర్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి

- నకిలీ మందు పిచికారితో ఎండిపోయిన మూడెకరాల వరిపొలం

- న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల రాస్తారోకో

దిశ, నల్లబెల్లి: నకిలీ పురుగు మందులు అమ్మి పంట నష్టానికి కారణమైన ఫర్టిలైజర్ షాప్ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నల్లబెల్లి మండలం కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. మండలంలోని నందిగామకు చెందిన రైతు ఇస్లావత్ రాజ్ కుమార్ తన మూడు ఎకరాల వరి పొలంలో కలుపు నివారణకు మందు కొనుగోలు చేయడానికి స్థానిక ఖాజా మైనుద్దీన్ ఫర్టిలైజర్ దుకానానికి వెళ్లాడు. అతను కోరిన 'నామిని గోల్డ్' కంపెనీ మందుకు బదులుగా, షాప్ యజమాని హైమద్ పాషా 'విన్ సూపర్' అనే మరో మందును బాగా పనిచేస్తుందని చెప్పి రూ.1700కు అంటగట్టాడు. రాజ్ కుమార్ ఆ మందును తన పొలంలో పిచికారీ చేయగా, వరి పంట ఎండిపోయింది. పంట నష్టపోయిన తర్వాత షాప్ యజమాని కంపెనీ ప్రతినిధులతో కలిసి రైతు ఇంటికి వచ్చి, నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని కోరాడు. అయితే, 20 రోజులు గడిచినా పరిహారంపై ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రాజ్ కుమార్ మాట్లాడుతూ, తన నష్టం మరే రైతుకు జరగకూడదని, నకిలీ మందులు విక్రయించే షాపును సీజ్ చేసి, యజమానిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో విద్యార్థి సంఘం నాయకుడు బొట్ల నరేష్, బట్టు సాంబయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ నిరసన కారణంగా వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరారు.

Next Story