నర్సింహులపేటలో ఏసీబీ ట్రాప్.. లంచం తీసుకుంటూ ఎంపీడీవో, ఎంపీఓ పట్టివేత

by Taduka Kalyani |

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఎంపీడీవో పెనుగొండ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య, ఎంపీడీవో కుమారుడు పెనుగొండ నాగార్జునలను శుక్రవారం ఎంపీడీఓ ఛాంబర్ లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నర్సింహులపేటలో ఏసీబీ ట్రాప్.. లంచం తీసుకుంటూ ఎంపీడీవో, ఎంపీఓ పట్టివేత
X

దిశ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఎంపీడీవో పెనుగొండ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య, ఎంపీడీవో కుమారుడు పెనుగొండ నాగార్జునలను శుక్రవారం ఎంపీడీఓ ఛాంబర్ లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు నర్సింహులపేట మండల పరిధిలోని పడమటి గూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేయగా ఆ భూమికి వెంచర్ అనుమతుల కోసం దరఖాస్తు చేయగా అనుమతులు మంజూరయ్యాయి. కాగా అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆ భూమి తనదేనంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో సంబంధిత మండల అధికారులకు నోటీసులు అందాయి. ఈ వ్యవహారంలో ఇలాంటి సమస్యలు ఉన్న మేమే పరిష్కరిస్తామని, కోర్టు నోటీసుల అంశాన్ని తాము చూసుకుంటామని చెప్పిన మండల అధికారులు బాధితుల వద్ద నుంచి లంచం గా నగదు డిమాండ్ చేయగా ఈ క్రమంలో గత నెలలో ఎంపీడీవోకు రూ.30 వేలు, ఎంపీఓకు రూ.25 వేలు చెల్లించినప్పటికీ కూడా నేటికీ సమస్య పరిష్కారం కాలేదని, ఇంకా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ వరంగల్ అధికారులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి, శుక్రవారం నర్సింహులపేట ఎంపీడీవో రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య లు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్‌స్పెక్టర్లు ఎల్. రాజు, ఎస్. రాజు, సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య రైడ్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు వారి బాధ్యతాయుతమైన పనులను చేయకుండా సామాన్య ప్రజలను లంచం అడిగినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 106 కి కాల్ చేయాలని అలాగే ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నెంబర్ 9154388912 నెంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story