​గ్రామ కార్యదర్శా.. మజాకా..!

by Kodari Anjali |

బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీలో పాలనా వ్యవహారాలు తీవ్ర గందరగోళంగా మారాయి.

​గ్రామ కార్యదర్శా.. మజాకా..!
X

దిశ,​ బూర్గంపాడు: బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీలో పాలనా వ్యవహారాలు తీవ్ర గందరగోళంగా మారాయి. ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన కార్యదర్శి బర్ల ప్రభాకర్, ప్రస్తుత కొత్త కార్యదర్శికి నేటికీ చార్జ్(బాధ్యతలు) అప్పగించకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బదిలీ జరిగి రోజులు గడుస్తున్నా బాధ్యతలు అప్పగించకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు దాగి ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తన హయాంలో జరిగిన లొసుగులు, లోపాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే ఆయన చార్జ్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

​అవస్థలు పడుతున్న కొత్త కార్యదర్శి!

​బూర్గంపాడు గ్రామ కార్యదర్శిగా పనిచేసిన బర్ల ప్రభాకర్ స్థానంలో సంపత్ శ్రీనివాస్ ఈ నెల 2వ తేదీన బాధ్యతలు చేపట్టారు. అయితే, కొత్త కార్యదర్శి బాధ్యతలు స్వీకరించి 12 రోజులు దాటినా, పాత కార్యదర్శి నుంచి అధికారికంగా ఎలాంటి రికార్డులు, చార్జ్ అందకపోవడంతో ఆయన అనేక ఇబ్బందులు, అవస్థలు ఎదుర్కొంటున్నారు. కనీసం బదిలీపై వెళ్లిన కార్యదర్శికి ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడం గమనార్హం. దీంతో పంచాయతీ రోజువారీ విధులకు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది.

​చేసింది తక్కువ.... బిల్లులు ఎక్కువ!

​గతంలో గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధుల పాలన లేని సమయంలో అధికారుల హవా సాగింది. ఆ సమయంలో స్థానిక అధికారుల ప్రమేయం లేకుండా గ్రామ కార్యదర్శి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో తక్కువ పనిచేసి,రికార్డుల్లో మాత్రం ఎక్కువ బిల్లులు సృష్టించారని స్థానికులు పేర్కొంటున్నారు.​ ఆ సమయంలో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో, భారీ మొత్తంలో నిధులు డ్రా చేయాలనే ఆలోచనలో కార్యదర్శి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే పంచాయతీ ఎన్నికలు జరగడం, కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నిక కావడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడి నుంచి బదిలీ అయిన ప్రభాకర్, తన హయాంలో జరిగిన ఖర్చుల బిల్లులను అధిక మొత్తంలో డ్రా చేసుకునేందుకు వీలుగానే చార్జ్ ఇవ్వకుండా ఆపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా​పారిశుద్ధ్య కార్యక్రమాల బిల్లులు, ​పెట్రోల్ బంకు వద్ద డీజిల్ వినియోగం, ​వీధిలైట్ల నిర్వహణ, ​ఖమ్మం నుంచి కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ సామాగ్రి, ​తదితర విభాగాల్లో భారీగా నిధులు డ్రా చేసేందుకు ఆయన ముందస్తు పథకం రచించినట్లు ప్రచారం సాగుతోంది.

​ఉన్నతాధికారుల తీరుపై అనుమానాలు?

​బదిలీపై వెళ్లిన కార్యదర్శి ప్రభాకర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినప్పటికీ, విచారణ అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.ఒకవైపు కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేయడం, మరోవైపు 12 రోజులు గడిచినా కొత్త కార్యదర్శికి చార్జ్ అప్పగించకపోవడం వెనుక ఉన్నతాధికారుల హస్తం లేదా లాలూచీ ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరిపి కొత్త కార్యదర్శికి బాధ్యతలు అందేలా చూడాలని బూర్గంపాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నూతనంగా విధుల్లో చేరిన కార్యదర్శి సంపత్ శ్రీనివాసుకు బదిలీపై వెళ్లిన ప్రభాకర్ చార్జ్ అప్పగించేలా చర్యలు తీసుకుంటామని బూర్గంపాడు ఎంపీడీవో జమలారెడ్డి దిశకు తెలిపారు.

Next Story