- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన మోడల్.. బ్యాంకాక్ టు ముంబై
బ్యాంకాక్ నుంచి ముంబైకి వచ్చిన మోడల్.. భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది.

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకాక్ నుంచి ముంబైకు చేరుకున్న 28 ఏళ్ల మోడల్.. గంజాయి సరఫరా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలు పాలయింది. ఆమె లగేజీ బ్యాగులో ఎవరికీ దొరక్కుండా దాచిన 11 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ముంబై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.11.82 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితురాలిని కేరళకు చెందిన మోడల్, మాజీ మిసెస్ కేరళ కంటెస్టంట్ హర్షా సన్నీగా గుర్తించారు. 2025 మిసెస్ కేరళ పోటీల్లో రన్నరప్ గా నిలిచినట్లు సమాచారం. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్షా సన్నీ జూన్ 10,11 తేదీల్లో మధ్యరాత్రి బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ (TG-351)లో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడ సాధారణ నిఘాలో ఉన్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ అధికారులకు ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో లగేజీని తనిఖీ చేశారు. ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగును క్షుణ్ణంగా వెతకగా.. లోపల వాక్యూమ్ సీల్ చేసిన 12 ప్లాస్టిక్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాటిలో గ్రీన్ కలర్లో ఉన్న పదార్థాన్ని గంజాయిగా గుర్తించారు. వెంటనే ఆమెను NDPS చట్టం కింద అరెస్ట్ చేశారు. నిందితురాలిని ముంబై కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా.. ఆ గంజాయిని ఎవరికి డెలివరీ చేసేందుకు తీసుకువచ్చింది? ముంబై సహా.. ఇతర నగరాల్లో ఉన్న డ్రగ్ మాఫియాతో ఆమెకు ఎలాంటి లింకులున్నాయి? అనే కోణాల్లో కస్టమ్స్, NCB అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.






