ఓటు హక్కు పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు యోధుల్లా పనిచేయాలి

by Taduka Kalyani |

హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఓటు హక్కు పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు యోధుల్లా పనిచేయాలి
X

దిశ, హన్మకొండ టౌన్: హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూత్ స్థాయి నాయకులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. ప్రతి బూత్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు హక్కు పరిరక్షణకు యోధుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ విజయానికి ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో అనేక ప్రాంతాల్లో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరిగాయని, "ఇప్పటి వరకు ఓటు వేశాం కదా" అనే నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరమని హెచ్చరించారు. రేపు ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రజాస్వామ్య హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పుల సవరణ, అన్యాయంగా తొలగించబడిన పేర్ల గుర్తింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం డాక్టర్ కడియం కావ్య రూపొందించిన "బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్" ను ఆవిష్కరించి బీఎల్ఏలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శంకర్ నాయక్, టీపీసీసీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాగ సీతారాములు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రియాంక అనిల్, కిసాన్ సెల్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story