ఫైల్ పెండింగ్.. పైసల్ డిమాండ్.. ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఉద్యోగి..

by Bhanu |   (  Updated:2025-06-18 15:53:39  IST  )

పట్టణంలోని గోపాలపురం కాలనీలో విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఫైల్ పెండింగ్.. పైసల్ డిమాండ్.. ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఉద్యోగి..
X

దిశ, మహబూబాబాద్ : పట్టణంలోని గోపాలపురం కాలనీలో విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎస్‌ఇ నరేష్ అనే విద్యుత్ ఉద్యోగి, ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే – మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, కురవి మండలాలకు సంబంధించిన పనుల కోసం రెండు టెండర్లను స్థానిక కాంట్రాక్టర్లు దాఖలు చేశారు. కానీ టెండర్ పరిమితి రూ.20 లక్షలు మాత్రమే ఉండగా, పనుల ఖర్చు ఎక్కువవడంతో వారు పరిమితి పెంచేలా అధికారులను కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ఫైల్ ఎస్‌ఇ నరేష్ వద్ద పెండింగ్‌లో ఉండగా, సమస్య పరిష్కరించాలంటే రూ.1 లక్ష లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్లు సమాచారం.

దీంతో కాంట్రాక్టర్ వరంగల్ ఏసీబీకి ఫిర్యాదు చేయగా, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నరేష్ రూ.80 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం నరేష్ నివాసంలో సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం ఆయనను వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ప్రభుత్వ అధికారుల లంచాలపై సమాచారం ఉంటే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

Next Story