టీజీఎండీసీ వే బ్రిడ్జికి గ్రహణం

by Ajay Maddhiboyina |

టీజీఎండీసీ ఆధ్వర్యంలో వే బ్రిడ్జి ఏర్పాటు కోసం ఓ రైతు భూమిని లీజుకు తీసుకున్నారు. 18 నెలలుగా వే బ్రిడ్జి ఏర్పాటు చేయకుండా, సదరు రైతుకు కిరాయి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

టీజీఎండీసీ వే బ్రిడ్జికి గ్రహణం
X

దిశ‌, ఏటూరునాగారం: టీజీఎండీసీ ఆధ్వర్యంలో వే బ్రిడ్జి ఏర్పాటు కోసం ఓ రైతు భూమిని లీజుకు తీసుకున్నారు. 18 నెలలుగా వే బ్రిడ్జి ఏర్పాటు చేయకుండా, సదరు రైతుకు కిరాయి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏటూరునాగారం మండ‌లం చిన్నబోయినప‌ల్లి గ్రామానికి చెందిన‌ మూల‌గుండ్ల భిక్షప‌తి త‌న భార్య మూల‌గుండ్ల ల‌క్ష్మి పేరు మీద చిన్నబోయిన ప‌ల్లి శివారు జాతీయ‌ ర‌హ‌దారి ప‌క్కన‌ ఉన్న 2 ఎక‌రాల భూమిలో 20 గుంటలు 2023 అక్టోబ‌ర్ నెల‌లో టీజీఎండీసీ శాఖ ఆధ్వర్యంలో వే బ్రిడ్జి నిర్వహ‌ణ కోసం నెల‌కు రూ.10 వేలు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. మిగిలిన ఎకరంనర భూమిలో పామాయిల్​ సాగు చేసుకుంటున్నాని బాధితుడు తెలిపాడు. అయితే వే బ్రిడ్జి ఏర్పాటు చేయ‌డం కోసం కంటాలు, సామాగ్రి లీజు తీసుకున్న 20 గుంట‌ల భూమిలోకి టీజీఎండీసీ అధికారులు త‌ర‌లించి అక్కడే ఉంచార‌ని, అట‌వీ శాఖ వే బ్రిడ్జి ఏర్పాటుకు అడ్డు చెప్పడంతో 18 నెల‌లుగా వే బ్రిడ్జి ఏర్పాటు చేయలేదని వాపోయాడు. వే బ్రిడ్జి సామగ్రి అక్కడే ఉండడంతో సాగుకు పనికిరావడం లేదని, 18 నెల‌లుగా త‌నకు అగ్రిమెంట్ ప్రకారం నెలనెల కిరాయి చెల్లించ‌డం లేదని, అగ్రిమెంట్ స‌మ‌యం కూడా ముగిసిపోయింద‌ని బాధితుడు వాపోయాడు.

అద్దె చెల్లించలేదు..

18 నెల‌లుగా నా భూమి సాగుకు నోచుకోకుండా చేశారు. టీజీఎండీసీ అధికారులు అగ్రిమెంట్ చేసుకున్న స‌మ‌యం కూడా ముగిసిపోయింది. నెలనెల చెల్లిస్తాన‌న్న అద్దె చెల్లించ‌డం లేదు. చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేస్తున్నా రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారనే త‌ప్ప న్యాయం మాత్రం జ‌ర‌గ‌డం లేదు.

– మూలగోండ్ల భిక్షప‌తి

Next Story