యువతను టార్గెట్ చేసిన డ్రగ్స్ గ్యాంగ్స్‌పై ఉక్కుపాదం

by Ratna Kumari |

మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కూంబింగ్ తనిఖీలు చేప‌ట్టారు.

యువతను టార్గెట్ చేసిన డ్రగ్స్ గ్యాంగ్స్‌పై ఉక్కుపాదం
X

దిశ, కేసముద్రం : మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కూంబింగ్ తనిఖీలు చేప‌ట్టారు. కేసముద్రం ఎస్సై కె. క్రాంతి కిరణ్, ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ “మ్యాక్స్”, డాగ్ హ్యాండ్లర్ శివరాజ్ పోలీస్ సిబ్బంది కలిసి గ్రామ శివారు ప్రాంతాలు, చెట్ల పొదలు, నిర్మానుష్య ప్రదేశాలు, రైల్వే ట్రాక్ పరిసరాలు, యువత గుమికూడే ప్రాంతాలు గంజాయి సేవిస్తున్నట్లు అనుమానిత ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ.. “గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి. క్షణిక ఆనందం కోసం భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి. యువత చదువు, ఉద్యోగం, క్రీడలు మరియు మంచి లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే 8712656999 నంబర్‌కు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి” అని తెలిపారు.


ఎస్సై క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కేసముద్రం పరిధిలో మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, గంజాయి సేవిస్తూ లేదా విక్రయిస్తూ పట్టుబడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి కుటుంబ సభ్యుల ఆశలను నిలబెట్టాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డాగ్ “మ్యాక్స్”, డాగ్ హ్యాండ్లర్ శివరాజ్, కేసముద్రం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story