- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనుమకొండ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు
తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన రాష్ట్ర స్థాయి రక్తదాన అవార్డుల్లో హనుమకొండ జిల్లా విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 8 అవార్డులను కైవసం చేసుకుంది.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన రాష్ట్ర స్థాయి రక్తదాన అవార్డుల్లో హనుమకొండ జిల్లా విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 8 అవార్డులను కైవసం చేసుకుంది. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, రక్తదాన శిబిరాల నిర్వహణ, అత్యధిక రక్త సేకరణ, రక్తదాతల భాగస్వామ్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చేసిన విశిష్ట కృషికి ఈ అవార్డులు లభించాయి. ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయ్ చందర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, “రక్తదానం మహాదానం, ప్రాణదానం” అని పేర్కొంటూ ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా స్వచ్ఛంద రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రక్త కొరత లేకుండా మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.హనుమకొండ రెడ్ క్రాస్ రక్తకేంద్రం, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు, వేలాది మంది రక్తదాతల సమిష్టి కృషి ఫలితంగానే జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయని గవర్నర్ అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 8 అవార్డులు రావడం గర్వకారణమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించిన హనుమకొండ రెడ్ క్రాస్ రక్తకేంద్రాన్ని రాబోయే రోజుల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, రక్త కొరత లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ , డి జి పి లా అండ్ ఆర్డర్ మహేష్ మురళీధర్ భగవత్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయ్ చందర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు, పలు జిల్లాల రెడ్ క్రాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






