పురాత‌న శిల్పాల‌కు కాప‌లాగా 3 శ్వేత నాగులు

by Ratna Kumari |

ములుగు జిల్లా ప‌రిధిలోని జాతీయ స‌మ్మ‌క్క‌-సార‌క్క సెంట్ర‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఓ విచిత్ర‌మైన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

పురాత‌న శిల్పాల‌కు కాప‌లాగా 3 శ్వేత నాగులు
X

దిశ‌, ఏటూరు నాగారం : ములుగు జిల్లా ప‌రిధిలోని జాతీయ స‌మ్మ‌క్క‌-సార‌క్క సెంట్ర‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఓ విచిత్ర‌మైన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణ పనుల వేళ కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయ శిలలతో పాటు, వాటి కింద నుంచి ఏకంగా మూడు శ్వేతనాగులు బుసలు కొడుతూ బయటకు రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన సిబ్బంది పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ చుట్టూ రూ. 24 కోట్ల వ్యయంతో, 8.4 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి ఆలయాల ఆనవాళ్లు, చారిత్రక అవశేషాలు బయటపడుతూనే ఉన్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్నప్పటికీ, నిర్మాణ సంస్థ జేసీబీల సహాయంతో ఆ శిలలను తొలగిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే జేసీబీతో ప్రహరీ గోడ కోసం కందకాలు తవ్వుతుండగా కొన్ని భారీ రాళ్లు అడ్డువచ్చాయి. సాధారణ రాళ్లే అనుకుని జేసీబీ ఆపరేటర్ వాటిని తొలగించేందుకు ప్రయత్నించగా.. అవి పురాతన ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాతి శిలలని తేలింది. వాటిని కదిలించే క్రమంలో ఒక్కసారిగా మూడు శ్వేతనాగులు పడగ విప్పి బుసలు కొడుతూ బయటకు వచ్చాయి.


ఆ శిలలను తొలగించే క్రమంలో జేసీబీ బకెట్ తగలడంతో ఒక శ్వేతనాగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన రెండు పాములు భీకరంగా బుసలు కొట్టడంతో భయపడిపోయిన జేసీబీ డ్రైవర్, అక్కడి సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత కోలుకున్న ఆపరేటర్ తిరిగి వచ్చి జేసీబీ స్టార్ట్ చేసి పనులు ప్రారంభించడానికి ప్రయత్నించాడు. అంతవరకు బాగానే ఉన్న జేసీబీ ఒక్కసారిగా మొరాయించడం స్టార్ట్ చేసింది. ఎంత ప్రయత్నించినా వాహనం స్టార్ట్ కాకపోవడంతో అక్కడ ఏదో దైవిక శక్తి ఉందనే ప్రచారం ఊపందుకుంది. దైవ సంకల్పం వల్లే ఇలా జరిగిందని భావించిన కాంట్రాక్టర్, సిబ్బంది ప్రహరీ గోడ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. తవ్వకాల్లో బయటపడ్డ శిలల ఆకృతిని బట్టి ఇక్కడ కాకతీయుల నాటి పురాతన ఆలయం ఉండేదని స్పష్టమవుతోంది. అంతటి ప్రాచీన శిలల కింద శ్వేతనాగులు కాపలాగా ఉండటం, జేసీబీ మొరాయించడంతో ఈ ప్రాంతంలో ఏదో రహస్యం దాగి ఉందంటూ స్థానికులు తీవ్ర భయాందోళనలు, ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక పరిశోధకులు దీనిపై స్పందించాల్సి ఉంది.

Next Story