పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టులు..ఎంత మందంటే..?

by Naveena |   (  Updated:2025-04-12 05:56:11  IST  )

ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 22 మంది నిషేధిత మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు.

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టులు..ఎంత మందంటే..?
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 22 మంది నిషేధిత మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా పోలీసులు, సీఆర్ పి ఎఫ్ 39 బెటాలియన్ అధికారుల సమక్షంలో మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం కోసం నిర్వహిస్తున్నటువంటి “పోరుకన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి” కార్యక్రమం నిర్వహించారు. దీంతో ములుగు జిల్లాలో లొంగిపోయినటువంటి మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకొని..హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. 22 మంది నిషేదిత సిపిఐ మావోయిస్టులు (ఏ సీఎం-03, పార్టీ సభ్యుడు - 01, ఆర్పిసి కమిటీకి చెందిన 18 మంది, మొత్తం 22 ) శుక్రవారం ములుగు ఎస్పీ ముందు లొంగిపోయినట్టు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

లొంగిపోయిన వారిలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం, యకన్నగూడెం గ్రామానికి చెందిన మడవి మాస, ఏ సీఎం (పి పి సి ఎం) హోదాలో బెటాలియన్ లో పనిచేస్తున్నాడు. ఇతను 2010 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరి బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో పనిచేస్తూ పలు హింసాత్మక ఘటనలలో పాల్గొన్నాడు. 2013 సంవత్సరంలో పార్టీ సభ్యుడు హోదా నుండి ఏ సీఎం గా ప్రమోషన్ పొంది.. మార్చి 2017 లో బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త చెరువు అంబుష్ ఘటనలో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించన సంఘటనలో, అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో బుర్కపాల్ గ్రామం వద్ధ రోడ్డు పనుల రక్షణ కోసం వచ్చినటువంటి సీఆర్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించన ఘటనలో ఏప్రిల్ 2021 సంవత్సరంలో టేకులగుర్మా గ్రామం వద్ధ పోలీసులపై చేసిన దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లు 24 మంది మరణించిన ఘటనలలో పాల్గొన్నట్టు ఎస్పి తెలిపారు.

లొంగిపోయిన వారిలో మరొకరు చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మల్లంపేట గ్రామానికి చెందిన ముచ్చకి జోగా రామ్ @ జోగా పామెడ్ ఏరియా కమిటీలో ఏ సీఎం హోదాలో పని చేస్తున్నాడు. ఇతనికి పార్టీ సభ్యుడు నుండి 2016 సంవత్సరంలో ఏరియా కమిటీ సభ్యుడిగా హోదా పొంది కోమటిపల్లి ఆర్ పి సి కి మిలిషియా చీప్ గా పనిచేస్తున్నాడు. 2017 ఏప్రిల్ నెలలో బుర్కపాల్ గ్రామం వద్ధ రోడ్డు పనుల రక్షణ కోసం వచ్చినటువంటి సీఆర్పీఎఫ్ పోలీస్ల పై దాడి చేసి 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించన ఘటనలో మరియు పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం క్యాంప్ పై దాడి చేసిన ఘటనలో మావోయిస్టు పార్టీ బెటాలియన్ కి చెందిన కట్టమ్ దేవా, ముచ్చకి వీక్రమ్, మడకం దేవా అనే ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారిలో చతిస్గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని, తుమ్మిరిగూడ గ్రామానికి చెందిన తాటి జోగా ఆదేవిధంగా మావోయిస్టు పార్టీ కొత్తపల్లి రాంపూర్ సర్కార్ కమిటీ అధ్యక్షుడు అయిన కోరం పాపారావు, మరియు కొత్తపల్లి రాంపూర్ సర్కార్ కమిటీ సభ్యులైన రౌతు హనుమయ్య, హనుమ మడవి, వెట్టి వెంకన్న, మాససోడి, మడకం దేవా, మడవి జోగా, బిరబోయిన నారాయణ, సోడి మాసు, దూడి జయరాం, మజ్జి విజయ్, షూరిటీ రవన్న, కొత్తకొండ మజ్జి హైమావతి, కల్లూరి శాంత, కల్లూరి తిరుపతమ్మ, మజ్జి నాగరత్న, మజ్జి తిరుపతమ్మ, మజ్జి సుశీల సభ్యులు లొంగిపోయినట్టు తెలిపారు.

వీరు మావోయిస్టులకి పోలీసుల సమాచారం, బియ్యం, కూరగాయలు మరియు ఇతర వస్తువులు చేర వేసేవారని తెలిపారు. ఈ సందర్భంగా ములుగు ఎస్పీ అజ్ఞాతంలో పనిచేస్తున్నటువంటి సిపిఐ మావోయిస్టు నాయకులు, సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయి తమ కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు జీవన ఉపాధి మరియు పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల సదుపాయాలు అందించడానికి ములుగు పోలీస్ ఎల్లప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సిఆర్పిఎఫ్ పిఎంజి పంచమీలాల్, ములుగు డిఎస్పి రవీందర్, వెంకటాపురం సిఐ కుమార్, పస్ర సీఐ రవీందర్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతి, కన్నాయిగూడెం ఎస్ఐ వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story