మానుకోట రాళ్లకు 16 ఏళ్లు.. నేటికీ మరువలేని ఘటన

by Ajay Maddhiboyina |

మలి దశ తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఘటన మరవలేని మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రగులుతున్న రోజులు అవి. సమైక్యాంధ్ర నినాదాలతో అప్పటి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్లమెంటులో ఫ్లకార్డు ప్రదర్శించడం తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది.

మానుకోట రాళ్లకు 16 ఏళ్లు.. నేటికీ మరువలేని ఘటన
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: మలి దశ తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఘటన మరవలేని మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రగులుతున్న రోజులు అవి. సమైక్యాంధ్ర నినాదాలతో అప్పటి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్లమెంటులో ఫ్లకార్డు ప్రదర్శించడం తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. అదే వేళ మానుకోట నుంచే “ఓదార్పు యాత్ర” శ్రీకారం చుడతానంటూ ఆయన ప్రకటించడంతో ఉద్యమ జ్వాలలు ఒక్కసారిగా మానుకోట వైపు కి మళ్లాయి. ‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనివ్వం.. మానుకోట గడ్డపై జగన్ ను అడుగుపెట్టనివ్వం’ అంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ, అప్పటి టీఆర్ఎస్ నాయకులు, ఓయూ, కేయూ విద్యార్థి సంఘాలు, న్యాయవాద జేఏసీలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయినా పర్యటన ఆగలేదు. దీంతో మానుకోట రైల్వే స్టేషన్ ఉద్యమ తుఫాన్‌కు కేంద్రబిందువైంది. అప్పటి ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్ల పద్మావతి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, మాలోత్ కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్ తదితరులు జగన్‌కు స్వాగతం పలికేందుకు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. వేలాది మంది ఉద్యమకారులు రైల్వే పట్టాలపై బైఠాయించి ‘సమైక్యవాదులారా గో బ్యాక్’ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది.

తూటాలకు ఎదురొడ్డిన ఉద్యమకారులు..

కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అనుచరులు ఉద్యమకారులను రెచ్చగొట్టడం, కర్రలతో ఎదురుదాడికి దిగడంతో తెలంగాణ ఉద్యమకారులు ప్రతిఘటనకు దిగారు. రైల్వే పట్టాలపై కంకర రాళ్లతో దాడికి దిగారు. క్షణాల్లోనే మానుకోట రైల్వే స్టేషన్ పై రాళ్ల వర్షం కురిపించారు. వెయిటింగ్ రూములు, ప్లాట్‌ఫామ్‌లు ధ్వంసమయ్యాయి. స్టేషన్​ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఉద్యమకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు తుపాకీ కాల్పులకు దిగారు. దీంతో మానుకోట రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. అనేక మంది ఉద్యమకారులు తీవ్రంగా గాయపడగా, మరికొందరు బుల్లెట్ గాయాలతో ఇప్పటికీ శారీరక, మానసిక వేదన అనుభవిస్తున్నారు.

11 మందికి మానని గాయాలు..

‘తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం’ అంటూ బుల్లెట్లకు ఎదురొడ్డి పోరాడిన జిల్లాకు చెందిన 11 మంది ఉద్యమకారులు తోటా రవి, భూక్య శోభన్,సయ్యద్ హిమామ్,హాచ్య,ముధాకర్, దిడి వెంకటేష్,కేలోత్ హథిరాం, రావోజీ, బిక్యా, రంగ్యా, పౌల్ రాజ్ బుల్లెట్ గాయాలతో మానని బాధను మోస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో శరీర భాగాల్లోకి తూటాలు దూసుకెళ్లడంతో వరంగల్​ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో గాయపడిన ఉద్యమకారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన 200 గజాల స్థలం, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, పెన్షన్‌తో పాటు సంపూర్ణ సహాయం అందిస్తామన్న హామీలు ఇప్పటికీ అమలు కాలేదని వాపోతున్నారు.

మానుకోట ఘటనపై కలం విప్పిన కవులు..

మానుకోట పోరాట ఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నేపథ్యంలో కవులు, కళాకారులు, రచయితలు తమ కలాలతో ఉద్యమ స్పూర్తిని ఆవిష్కరించారు. ‘మానుకోట 28 మే 2010’ పేరుతో వెలువడిన పుస్తకం సమైక్యవాదుల దాడులను, ఆ రోజు జరిగిన ఘటనలను ప్రజల ముందుంచగా, తెలంగాణ అక్ష"రాళ్లు” పేరుతో వచ్చిన ప్రత్యేక సంపుటిలో కవులు, కళాకారులు తమ సాహిత్య, సాంస్కృతిక రూపాల్లో మానుకోట పోరాట గాథను వినిపించారు. ఇవేకాక మరెన్నో పుస్తకాలు, స్మారక రచనలు, ప్రత్యేక సంచికలు మానుకోట రాళ్ల ఘటనను చరిత్రలో నిలిపే ప్రయత్నం చేశాయి.

2,500 మందిపై కేసులు..

మానుకోట ఘటన అనంతరం ఉద్యమకారులపై పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రైల్వే ట్రాక్‌పై నిరసన తెలిపిన సుమారు 2,500 మంది ఉద్యమకారులపై జీఆర్పీ పోలీసులు న్యూసెన్స్ కేసులు నమోదు చేసి అనంతరం మానుకోట సివిల్ పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి నమోదైన కేసులు మాత్రం 16 మంది ఉద్యమకారులపై కొన్ని ఏళ్ల పాటు కొనసాగగా తర్వాత ఈ కేసులను కూడా కొట్టి వేశారు. కానీ ఆ సమయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికి పోవడంతో పాటు మానసిక క్షోభ అనుభవించామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ..

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినవారు, బుల్లెట్ గాయాలతో వికలాంగులైన వారు, ఉద్యమ కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపిన వారిని అధికారికంగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీకి కే. కేశవ్ రావు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా కోదండరాం, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిని నియమించారు.

ఉద్యమంలో వివిధ రూపాల్లో పాల్గొని నష్టపోయిన అర్హుల వివరాలను సేకరించి, పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించడం కమిటీ ప్రధాన బాధ్యత. ప్రస్తుత నిబంధనల్లో మరికొంత సడలింపు అవసరమని పలువురు ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమ సమయంలో ఆధారాలు కోల్పోయిన వారు, కేసులు నమోదైనా రికార్డులు అందుబాటులో లేని వారు,తీవ్ర గాయాలతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న వారిని మానవీయ కోణంలో పరిగణించాలని కోరుతున్నారు.

Next Story