సారా సరే బెల్లం సంగతేందీ?.. అసలు ముడి సరుకు ఎక్కడిది?

by Bhanu |   (  Updated:2025-05-19 11:22:03  IST  )

గిరిజనుల అధికంగా ఉండే జిల్లా, అధికంగా అటవీ ప్రాంతం ఉన్న జిల్లా మహబూబాబాద్.

సారా సరే బెల్లం సంగతేందీ?..  అసలు ముడి సరుకు ఎక్కడిది?
X

దిశ,డోర్నకల్: గిరిజనుల అధికంగా ఉండే జిల్లా, అధికంగా అటవీ ప్రాంతం ఉన్న జిల్లా మహబూబాబాద్. ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుతనంతో ఉన్న ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చాకా అభివృద్ది ఫలాలు అందుతున్నాయి.గిరిజన,అటవీ ప్రజలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో గతంలో సారాయి విరివిగా తయారి విక్రయాలు అధికంగా ఉండేది.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైయ్యాక సారా మహమ్మారిని చాలా కష్టం మీద తగ్గించారు. మానుకోట ప్రాంతాన్ని సార రహిత జిల్లాగా చేసేందుకు నాటి పోలీసు,ఎకైజ్ శాఖలు సమిష్టిగా పని చేసి సారా వల్ల కలిగే దుష్పరిణామాలను తండాల,గూడాల ప్రజలకు వివరించి వారిలో చైతన్యాన్ని కల్పించి ఈ మహమ్మారిని దూరం చేయటానికి కృషి చేశారు.అయితే నేడు ఈ సారా మళ్లీ గ్రామాల్లో,తండాల్లో గుప్పు మంటోంది. తండాలు మారు మూల గ్రామాల నుంచి పట్టణాల్లో సైతం సారా తయారీ వీపరితమవుతుంది అన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ మధ్య తరచూ సారా పట్టివేతలు అధికమవుతున్నాయి.అయితే సారా తయారీ అటుంచితే అసలు సారాయి తయారీలో ముడిసరుకైన నల్ల(తెల్ల)బెల్లం,పటిక వారికి ఎలా చేరుతుంది.మారుమూల తండాలకు బెల్లం,పటిక ఎవరు చేర్చుతున్నారు.. ఇంత జరుగుతున్నా ఆ 'శాఖ'హరులు ఏం చేస్తున్నారని ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పట్టుకున్నా మారని తీరు..

మండలంలో ఎన్నో సందర్భాలలో నిషేధిత బెల్లాన్ని రవాణా చేస్తున్న నిందితులను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా నేరస్తుల ప్రవర్తనలో మార్పు రావటంలేదు.రిమాండ్ లేకపోవడం,ఫ్రెండ్లీ పోలీసింగుతో బెరుకు లేకుండా దందా చేస్తున్నారు. పటిష్టంగా నిఘా ఉంచిన పోలీసు,ఎక్సైజ్ యంత్రాంగం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నల్ల(తెల్ల)బెల్లం అక్రమ రవాణా రోజురోజుకు అడ్డు అదుపు లేకుండా ముఖ్యంగా డోర్నకల్,సీరోల్,కురవి, మరిపెడ,చిన్నగూడూరు,దంతాలపల్లి,నరసింహుల పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున బెల్లం, పట్టిక అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్,ఖమ్మం కేంద్రాల బెల్లం అక్రమార్కులు సునాయాసంగా ఉప్పెనై సాగిస్తున్నారు.డోర్నకల్,ములకలపల్లి,మన్నెగూడెం,మల్లయ్యకుంట తండా, సీరోల్,కాంపెల్లి,రేకులతండా,లింగ్యతండా,ఇతర గ్రామాల నుంచి అక్రమార్కులు తమ కార్యకలాపాలు జరుపుతున్నట్లు వినికిడి.కురవి,మరిపెడ,చిన్నగూడూరు,దంతాలపల్లి,నరసింహుల పేట చీకటి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నట్టు తెలుస్తోంది.తరచూ ఈ వ్యాపారం చేసే వారిపై పి.డి యాక్ట్ కేసు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని లేదంటే అమాయకులు మరెందరో బలవాల్సిందే.

సహకరిస్తోందెవరు?

అయితే అంత చాపకింద నీరులాా సాగుతున్న ఈ నల్ల(తెల్ల)బెల్లం అక్రమ వ్యాపారానికి సహకరిస్తోందెవరన్నది బహిరంగానే ప్రజల్లో చర్చ జరుగుతోంది.పక్క రాష్ట్రాల్లో బస్తా రూ.3వేలకు కొనుగోలు చేసి అడ్డదారుల్లో అక్రమార్కులు జిల్లాలో తీసుకువచ్చి రూ.8నుంచి10వేలకు విక్రయిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యాపారంలో అధికంగా డబ్బు వస్తోండటంతో చాలా మంది ఈజీ మనీ కోసం రిస్క్ అయినా ఈ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.కాగా దీని కోసం కొంత మందిని మేనేజ్ చేయాల్సిన అవసరముండగా కొంత మంది 'గొట్టం' రాయుళ్లు అన్ని తామూ చూసుకుంటామని సదరు వ్యక్తుల,అక్రమార్కులకు మీడియేటర్లుగా ఊంటు నెలవారీగా మాముళ్లు తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అక్రమాలకు అడ్డుకట్టవేయాల్సిన వారు అంతా తెలిసి తమకేం తెలియదు ఎక్కడా ఏంజరగలేదు అని ఆస్కార్ లెవల్లో నటిస్తుండటంతో ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.సారాయిని పాతరేయాల్సిన సమయంలో ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు చేస్తున్న ఈ దందాతో ఈ ప్రాంత ప్రజల మనుగడ ముప్పులో పడుతోంది. ప్రధానంగా ఆయా కార్యాకలాపాలకు మీడియేటర్లుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమైన వారిని తప్పుడు మార్గంలోకి లాగి వారికి కలంకం తెచ్చే వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్న వారిపై రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు ఫొకస్ చేయాలని గిరిజన, అటవీ ప్రాంత వాసులు కోరుతున్నారు.

కంప్లీట్ గా కంట్రోల్ చేస్తున్నాం : మహబూబాబాద్ డిఎస్పి యన్.తిరుపతిరావు

బెల్లం అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా ఉంది.జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి తీసుకొస్తున్నాం.బెల్లం నిల్వలపై దాడులు జరుపుతున్నాం.బెల్లం,పట్టిక చిత్తూరు నుంచి వస్తుంది.సిసిఎస్,స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిత్యం నిఘా పెట్టారు.ఒకటి,రెండున్న నియంత్రిస్తాం.మీడియేటర్లు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారనేది నిజం కాదు.ఎక్స్చేంజ్ శాఖ కూడా బెల్లం సారా రవాణాకు చెక్ పెట్టుటకు ప్రయత్నిస్తుంది.


నిత్యం నిఘా ఉంది.. దాదాపు కంట్రోల్ లోకి వస్తుంది. : జిల్లా ఎక్సైజ్ అధికారి బి.కిరణ్

మహబూబాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే చాలావరకు బెల్లం రవాణా,సారా తయారీని నియంత్రించాం.నిత్యం లారీల కొద్ది బెల్లం ఈ ప్రాంతానికి దిగుమతి అయ్యేది.ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు.పక్క రాష్ట్రం నుంచి అరకొర తెస్తున్నారు.చదువుకున్న యువత ఈజీ మనీకి అలవాటు పడి కొందరు అక్రమ వ్యాపారం వైపు అడుగులేస్తున్నారు.చాప కింద నీరులా అక్కడక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోలీస్,ఆబ్కారి శాఖ సంయుక్తంగా దాడులు,అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.మీడియేటర్లు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారనేది నిజం కాదు.పట్టుబడిన వ్యక్తులకు స్టేషన్ బెయిల్ దొరుకుతుండడం ఇబ్బందిగా మారింది.మళ్లీ మళ్లీ అక్రమాలకు పాల్పడుతున్నారు.కఠిన చర్యలకు మార్పులు చేర్పులు జరగాలి.ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పిడి యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.


Next Story