డిగ్రీలో సీటు కావాలా? 121 కాలేజీల్లో కొత్త కోర్సులు.. దోస్త్ రిజిస్ట్రేషన్ తేదీలు ఇవే

by Ramesh Naini |

డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది 121 కాలేజీలు కొత్త కోర్సులకు అప్లయ్ చేసుకున్నాయని విద్యా మండలి చైర్మన్ తెలిపారు.

డిగ్రీలో సీటు కావాలా? 121 కాలేజీల్లో కొత్త కోర్సులు.. దోస్త్ రిజిస్ట్రేషన్ తేదీలు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో షెడ్యూల్‌ ప్రకటించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ పోర్టల్ ద్వారా ఈ నెల 15 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమై జూన్ చివరి నాటికి పూర్తవుతుంది. మూడు విడతల సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు జూన్ 20 నుంచి జూన్ 27 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30 తేదీల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూలై 1 నుండి మొదటి సెమిస్టర్ తరగతులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు మహిళా వర్సిటీలు, జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో బీఏ, బి.కామ్, బి.ఎస్సీ, బీబీఏ, బీసీఏ వంటి కోర్సుల్లో అడ్మిషన్లు లభించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం తమ హాల్ టికెట్ నంబర్ తో వెబ్ సైట్ https://dost.cgg.gov.in లో ధరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కోర్సులు : ప్రొ.బాలకిష్టారెడ్డి

విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఇన్నోవేటివ్ కోర్సులను కొత్తగా డిగ్రీలో ప్రవేశపెడుతున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. దోస్త్‌లో మొత్తం 969 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 4,40,107 సీట్లు ఉన్నాయి. గతేడాది 2,05,140 సీట్లు నిండాయి. ఈ ఏడాది 121 కాలేజీలు కొత్త కోర్సులకు అప్లయ్ చేసుకున్నాయని తెలిపారు. గత ఏడాది జీరో అడ్మిషన్స్ కాలేజీలు 54 కాగా, 60 నాన్ దోస్త్ కాలేజీలపై కోర్టు కేసులు నడుస్తున్నాయని చైర్మన్ వివరించారు. డిగ్రీలో అనేక ఛాలెంజెస్ ఉన్నాయని, కోర్సుతోపాటు ఇంటర్న్‌షిప్ ఇస్తే డిగ్రీ కోర్సు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంజనీరింగ్‌లో సీట్స్ తగ్గే అవకాశం ఉండడంతో డిగ్రీని ఇంకా బలోపేతం చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మూడు విడతల్లో దోస్త్ ప్రక్రియ

విద్యార్థులు తమ దరఖాస్తులు సమర్పించేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అభ్యర్థులు ముందుగా తమ వివరాలతో ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకుని దోస్త్ ఐడీ తీసుకోవాలి. రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత విద్యార్థులకు ఒక పిన్ నంబర్ వస్తుంది. అడ్మిషన్ ప్రక్రియ ముగిసే వరకు ఈ పిన్‌ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. దోస్త్ ఐడి, పిన్ ఉపయోగించి లాగిన్ అయి, తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి ఆధార్ నంబర్ మొబైల్ నంబర్‌తో అనుసంధానమై ఉంటే, మొబైల్ ఓటీపీ ద్వారా నేరుగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తేదీలు, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

దోస్త్ మొదటి విడత

రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 15 – మే 7 ( అప్లికేషన్ ఫీజు రూ.200)

వెబ్ ఆప్షన్లు: ఏప్రిల్ 30 –మే 8

సర్టిఫికెట్ వెరిఫికేషన్: మే 7, 8

సీట్ల కేటాయింపు: మే 14

సెల్ఫ్ రిపోర్టింగ్: మే 15 నుంచి 23

రెండో విడత

రిజిస్ట్రేషన్: మే 15 – మే 25 (ఫీజు రూ.400)

వెబ్ ఆప్షన్లు: మే 15 – మే 26

వెరిఫికేషన్: మే 26

సీట్ల కేటాయింపు: మే 30

సెల్ఫ్ రిపోర్టింగ్: మే 31 నుంచి జూన్ 5

మూడో విడత

రిజిస్ట్రేషన్: మే 31 – జూన్ 15 (ఫీజు రూ.400)

వెబ్ ఆప్షన్లు: మే 31 – జూన్ 16

వెరిఫికేషన్: జూన్ 16

సీట్ల కేటాయింపు: జూన్ 20

సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 20 నుంచి జూన్ 25

Next Story