ఒక డెత్ సర్టిఫికెట్ కోసం నెలన్నర వేచి చూడాలా? చార్మినార్ జోనల్ ఆఫీస్‌పై ఆరోపణలతో ఇన్‌స్టా రీల్ వైరల్!

by Ramesh Naini |

తాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) కోసం చార్మినార్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ నెలన్నర రోజులుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఒక డెత్ సర్టిఫికెట్ కోసం నెలన్నర వేచి చూడాలా? చార్మినార్ జోనల్ ఆఫీస్‌పై ఆరోపణలతో ఇన్‌స్టా రీల్ వైరల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) కోసం చార్మినార్‌లోని జీహెచ్ఎంసీ (GHMC) జోనల్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ నెలన్నర రోజులుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలతో ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. వైరల్ వీడియో ప్రకారం.. బన్నీ (bunny_thebeast) అనే యువకుడు తన సోదరుడి కాలేజీలో సమర్పించడానికి తాత డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెలన్నర రోజులుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు సీట్లో ఉండరని, ఒకవేళ ఉన్నా గంటల తరబడి వేచి చూడమంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ వీడియోలో ఆరోపించాడు.

ఫిర్యాదు చేస్తానంటే బెదిరింపులు

అధికారుల తీరుపై ఫిర్యాదు చేస్తానని చెప్పినందుకు, ‘వెళ్లి చేసుకో’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని, ఆ కక్షతోనే తన దరఖాస్తును పక్కనపెట్టారని యువకుడు వాపోయాడు. వీడియో అప్‌లోడ్ చేయడానికి ముందు రోజు రాత్రి విచారణ పేరుతో 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అధికారులు దురుసుగా ప్రవర్తించారని బన్నీ తెలిపాడు. తాను కేవలం 5 నిమిషాలు బయటకు వెళ్లిన సమయంలో వచ్చి, ‘దరఖాస్తుదారుడు అందుబాటులో లేడు’ అని చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డాడు. ‘ఇంత పెద్ద భవనం ఉండి ఏం లాభం? అసలు అధికారులకు జీహెచ్ఎంసీ అంటే ఏంటో తెలుసా?’ అంటూ వీడియోలో సిబ్బందిని యువకుడు నిలదీశాడు. ఏప్రిల్ 18న పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటి వరకు 37 వేలకు పైగా లైక్స్, వేల కామెంట్స్, షేర్లతో వీడియో వైరల్ అవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు ఇస్తేనే పనులు అవుతాయని కామెంట్లు చేస్తున్న నెటిజన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి, జీహెచ్ఎంసీ అధికారుల ఖాతాలను ట్యాగ్ చేస్తూ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story